'దిశ' ఎఫెక్ట్.. శిలాఫలకంపై పేరు తొలగింపు.. మరి కార్పొరేట్ ఎవరు..?

by Vinod kumar |   ( Updated:2022-04-11 14:16:33.0  )
దిశ ఎఫెక్ట్.. శిలాఫలకంపై పేరు తొలగింపు.. మరి కార్పొరేట్ ఎవరు..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాని వ్యక్తి పేరు శిలాఫలకంపై చెక్కించిన మున్సిపల్ అధికారులు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. 'దిశ' దిన పత్రికలో వచ్చిన వరుస కథనాలతో అధికార యంత్రాంగం ఎట్టకేలకు కదిలింది. శిలాఫలకంపై చెక్కించిన పేరుపై బ్లాక్ కలర్ పూసి పేరును మాత్రం తొలగించారు. ఈ నెల 5న కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంపై 18 వ డివిజన్ కార్పొరేటర్ సూదగోని మాధవి పేరుకు బదులుగా ఆమె భర్త కృష్ణ గౌడ్ పేరును చెక్కించారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రజా ప్రతినిధి పేరు కాకుండా ఆమె భర్త పేరును చెక్కించడం విమర్శలకు దారి తీసింది. ఈ విషయాన్ని 'దిశ' వెలుగులోకి తీసుకు రావడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిలాఫలకంపై కృష్ణ గౌడ్ పేరు వద్ద బ్లాక్ కలర్ వేయించారు. అయితే 18వ డివిజన్ కార్పొరేటర్ అన్న పదాన్ని మాత్రం అలాగే ఉంచి ఖాలీ స్థలంలో మాత్రం ప్రజా ప్రతినిధి పేరు చెక్కించలేదు.

చర్యలు ఉండేనా..?

అయితే ప్రోటోకాల్ వింగ్ తో సంబంధం లేకుండా అనధికార నాయకున్ని అధికారికంగా గెలిచిన ప్రజా ప్రతినిధి అని బాజాప్తాగా చెక్కించిన విషయంలో బల్దియా శాఖాపరమైన చర్యలకు తీసుకుంటుందా లేక ఇంతటితో వదిలేస్తుందా అన్న చర్చ సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఉద్యోగులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకునే విషయంలో మీనామేషాలు లెక్కిస్తూ శిలాఫలకంపై పేరు తొలగించామని తప్పించుకునే అవకాశాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.


మొక్కుబడి చర్యలతో సరిపెట్టి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నట్టయితే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాఖాపరంగా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు చర్యలకు వెనకాడుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించే విషయంలో ఆలోచించే ధోరణిని ప్రదర్శించడం సరికాదన్న వాదనలు ఉన్నాయి.

కార్పొరేటర్ ఎవరూ..?

అయితే శిలాఫలకంపై 18 వ డివిజన్ కార్పొరేటర్ అని మాత్రం అలాగే ఉంచడంతో ఇంతకీ ఆ కార్పొరేటర్ ఎవరూ అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. పేరును చెక్కించాల్సిన స్థానంలో ఖాళీగా వదిలేయడంతో కార్పొరేటర్ ఎవరూ అన్న ప్రశ్న తలెత్తుతోంది. తప్పుగా చెక్కించిన పేరును తొలగించినప్పటికీ అధికారికంగా గెల్చిన కార్పొరేటర్ మాధవి పేరును మాత్రం అక్కడ చేర్చకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో అంతు చిక్కకుండా పోయింది. తూతూ మంత్రంగా పేరును తొలగించామని యంత్రాంగం చేతులు దులుపుకునేందుకే కృష్ణ గౌడ్ పేరు కనిపించకుండా బ్లాక్ కలర్ వేసి చేతులు దులుపుకున్నారా.. లేక అధికారికంగా గెల్చిన కార్పొరేటర్ పేరును చేరుస్తారా అన్న చర్చ సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed