సరదా మాటున దాగిన ప్రమాదాలు ఎన్నో!

by Aamani |
సరదా మాటున దాగిన ప్రమాదాలు ఎన్నో!
X

దిశ,వలిగొండ: వేసవి దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులో చ్చాయి. దీంతో పిల్లలు తమ సెలవు దినాలను సరదా,సంతోషాలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ఒక్కోసారి ఆనందం వెన్నంటే విషాదాలు పొంచి ఉండే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు సరదాలకు అలవాటు పడి తల్లిదండ్రులు వారిని ఇంటి పట్టున ఉండేందుకు సుముఖత చూపరు.ఇంట్లో చెప్పా పెట్టకుండా సరదా కోసం బావులు,చెరువులు, మూసి వాగు వెంట,కాలువల్లోకి వెళ్లి ఈత కోసమని,చేపల వేట కోసమని,ఎండను సైతం లెక్క చేయక క్రికెట్,గోలీలాట ఆడడం కోసమని,బైక్ డ్రైవింగ్ లంటూ వాహనాలపై సవారీలు చేయడం లాంటివి చేస్తుంటారు. పై వాటిలో ఏ మాత్రం అటు ఇటు అయిన ప్రమాదాలను కొనితెచ్చుకునే అవకాశాలు లేకపోలేదు. వారిని ఓ కంట కనిపెట్టాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.


సరదా మాటున దాగిన ప్రమాదం..

వేసవి సెలవులు కావడంతో పిల్లలు సరదాగా సమీప బావుల్లో,చెరువుల్లో స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు, నేర్చుకోవడానికి వెళ్తుంటారు. సరదా మాటున ప్రమాదం పొంచి ఉందనే విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. ఈత నేర్చుకునే క్రమంలో తమకు ఈత వచ్చు అని అత్యుత్సాహంతో పెద్దలు ఎవరు తోడు లేకుండానే బావులు,చెరువులు, కుంటలు, వాగుల లోతును అంచనా వేయక అందులోకి దిగుతారు. తీరా దిగాక లోతు ఎక్కువగా ఉండటం,మట్టి పేరుకుపోయి ఉండటం తదితర కారణాల వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. సమయం ఉంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఈత నేర్పించాలి. లేకపోతే పిల్లలు వాటి జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. అలాగే ఎండలో తిరగడం వలన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. మండుటెండలో క్రికెట్, గోలీలాట వంటి ఆటలను ఆడి వడదెబ్బకు గురవడం, జ్వరానికి గురవడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి వారి నీడ పట్టునే ఉండి అవుట్డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ అయినా చెస్, క్యారమ్స్ లాంటి ఆటలు అలవాటు చేసుకునేలా ప్రోత్సహించాలి.

వాహనాలతో జాగ్రత్త...

ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు,సైకిళ్లు అంటే పిల్లలకు ఎక్కువగా ఇష్టం. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాటిని నడుపుతూ రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వారిని వాటికి దూరంగా ఉంచాలి. అవసరమైతే పెద్దలు పక్కనే ఉండి వాటిని నడపడం నేర్పించాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

* ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో పిల్లలను అవసరమైతే తప్ప బయటకు పంపొద్దు.

* ఈ సమయంలో వీలును బట్టి తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపేందుకు అధిక సమయం కేటాయించాలి.

* ఇంటి పట్టున ఉండే పిల్లలకు వారి పని( హోం వర్క్)లో సాయం చేస్తూ తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి.

* నీతి కథలు, స్ఫూర్తి గాధలు చదివే విధంగా ప్రోత్సహించాలి. తద్వారా చిన్నారులు ఇంటిపట్టున ఉండే అవకాశం ఉంది.

నీరు ఎక్కువగా తీసుకోవాలి..

ఎండలు మండుతున్న వేళ ఎండ తాపానికి పిల్లలకు గురికాకుండా నీటిని ఎక్కువగా అందించాలి. ఫ్రిజ్ వాటర్ కన్నా మట్టి కుండలో నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. వీలైనంతవరకు శీతల పానీయాలకు పిల్లలను దూరంగా ఉంచాలి. మజ్జిగ, పెరుగు వంటివి అందిస్తే ఆరోగ్యానికి మరీ మంచిది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు ఎక్కువయ్యే కొద్దీ పిల్లలు ఆహారం తీసుకునేందుకు మారాం చేసే అవకాశం ఉంది. ఇలాంటి వారికి పళ్ల రసాలు ఎక్కువగా తాగించాలి. పిల్లలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ ఓఆర్ఎస్ ను ఎల్లప్పుడూ ఇంటిలో ఉంచుకుంటే మంచిది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు హాజరవ్వాలంటే ఎండ తీవ్రత లేనప్పుడు పిల్లలతో బయలుదేరితే మంచిది. వేసవికాలం ముగిసేంత వరకు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.



Next Story

Most Viewed