టీడీపీ సభ్యులను భగవంతుడు కూడా కాపాడలేడు: పేర్ని నాని

by Javid Pasha |
టీడీపీ సభ్యులను భగవంతుడు కూడా కాపాడలేడు: పేర్ని నాని
X

దిశ, ఏపీ బ్యూరో : అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుల తీరుపై మంత్రి పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సభలో ఈలలు వేయడంపై మండిపడ్డారు. మీరు శాసన సభ్యులేనా? సభలో విజిల్స్ వేసేంత గాలి తనంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది తమ సమస్యలపై చర్చించి తమకు న్యాయం చేస్తారని ఆ విషయం గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీకి ప్రజలు మిమ్మల్ని పంపించినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించాలో మీకు తెలియడం లేదా అని నిలదీశారు. కనీసం బాధ్యత కూడా లేకుండా టీడీపీ సభ్యులు ప్రవర్తించడంపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. సభలో విజిల్స్‌ వేసి టీడీపీ సభ్యులు గాలిగా ప్రవర్తించారని, వారి పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. సభ సజావుగా నడిపించాలనే ఉద్దేశంతోనే.. సభలో ఘర్షణ చేస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయడం జరిగిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

సభలో ఈలలు వేస్తూ రచ్చరచ్చ చేయడం టీడీపీ సభ్యులకే చెల్లుతుందని విమర్శించారు. సభలో చేయాల్సిన రచ్చంతా చేసేసి బయటకు వచ్చి బొంకడం వారికే చెల్లుతుందని ధ్వజమెత్తారు. రోజు రోజుకు టీడీపీ సభ్యులు సభలో దిగజారి వ్యవహరిస్తున్నారని.. వారిని భగవంతుడు కూడా కాపాడలేరంటూ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed