- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన ఇంటి చెత్తతోనే పంచభూతాలు కాలుష్యం.. ఇంట్లోనే కంపోస్టింగ్ చేస్తున్న మహిళ
దిశ, ఫీచర్స్ : గల్లీ నుంచి ఢిల్లీ వరకు 'చెత్త' ఓ ప్రధాన సమస్య. ఆ రొడ్డు వెంబడే నిత్యం వెళుతూ.. ముక్కుమూసుకుని మూడడుగులేసి చేతులు దులుపుకుంటాం తప్ప ఆ సమస్య మనదని భావించే సాహసం చేయం. కానీ 2009లో మావల్లిపుర(బెంగళూరు) డంప్‌యార్డ్‌లో నాలుగు మిలియన్ టన్నుల చెత్తను చూశాక వాణీ మూర్తి మాత్రం ముక్కున వేలేసుకుంది. ఆనాటి నుంచి తన ఇంటి నుంచి పూచికపుల్ల కూడా బహిరంగ చెత్తడబ్బాల్లోకి వెళ్లనివ్వనని ప్రమాణం చేసి, ఇంట్లోనే కంపోస్టింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇంత పెద్ద వ్యవస్థలో తను మారితే సరిపోదు కదా తనతో పాటు మరో పదిమందిని ఈ కార్యంలో భాగం చేయాలనుకున్న తను 'కంపోస్టింగ్ నిర్వహణపై' అవగాహన కల్పించేందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకుంది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వార్మ్ రాణి (@WormRani)గా తన ప్రొగ్రామ్స్ కొనసాగిస్తూ రెండున్నర లక్షలకుపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం సహా 'వేస్ట్ మేనెజ్‌మెంట్'లో వారందర్నీ భాగం చేస్తోంది. వ్యర్థాలు, కంపోస్టింగ్ నిర్వహణ, సుస్థిరతపై ఆమె అందించే సమాచారం ఈ 60 ఏళ్ల గృహిణికి ఎంతో పేరు తెచ్చిపెట్టడంతో పాటు నేషనల్ జియోగ్రాఫిక్ నిర్వహించిన 'వన్ ఫర్ చేంజ్' క్యాంపెయిన్‌లో వన్ ఆఫ్ ది చేంజ్‌మేకర్‌గా చోటు కల్పించింది.
వ్యర్థాలను నిర్వహించడం లేదా వ్యర్థాలను వేరుచేసే బాధ్యతాయుతమైన మార్గాల వైపు చర్చ మళ్లినప్పుడల్లా, అది మునిసిపాలిటీ బాధ్యతే అని చాలా మంది వాదిస్తుంటారు. అందుకుభిన్నంగా వ్యర్థాలను ఉత్పత్తి చేసేది మనమే కాబట్టి ఆ వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తే, దానికి బాధ్యత కూడా తమదేనని పర్యావరణ ప్రేమికులు, బాధ్యాతాయుతమైన వ్యక్తులు మాత్రమే భావిస్తారు. ఈ జాబితాలో బెంగళూరుకు చెందిన వాణి మూర్తి ఒకరు కానీ పదేళ్ల క్రితం ఆమె కూడా చెత్తను బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా పడవేసేది. ఒకానొక రోజు స్థానిక పౌర సంస్థలో స్వచ్ఛంద సేవకు వెళ్లగా.. అక్కడ ప్రముఖ గైనకాలజిస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ మీనాక్షి భరత్‌ను కలిసిన తర్వాత తన పంథాను మార్చుకుంది.
చెత్తతో సమస్యేంటంటే?
'కంపోస్టింగ్' అనగానే చాలా మంది ప్రజలు అదొక దుర్వాసన ప్రక్రియగా భావిస్తుంటారు. అంతేకాదు చెత్తను నిర్వహించుకునే సమయం లేదని, మనుషులు ఉండేందుకు సరైన జాగా లేదంటే ఇంకా కంపోస్ట్ చేసేందుకు ప్రత్యేక స్థలం ఎలా కేటాయిస్తారని ఎదురు ప్రశ్నిస్తుంటారు. నిజానికి ప్రతీ ఇంటి నుంచి పోగయ్యే చెత్తే పల్లపు ప్రదేశాల్లో గుట్టలుగుట్టలుగా పేరుకుపోతుందనే విషయం ఎలిమెంటరీ పిల్లోడికి కూడా తెలుసు. కానీ తెలియందేంటంటే.. ఆ ప్రాంతంలో ల్యాండ్‌ఫిల్ కుదించబడి, తడి వ్యర్థాలు కుళ్ళిపోతుండటంతో మీథేన్ విపరీతంగా ఉత్పన్నమవుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు దారితీయడం సహా గాలిని కూడా కలుషితం చేస్తుంది. అంతేకాదు లీచేట్ అని పిలిచే చిక్కటి నల్లని ద్రవం ఉత్పత్తవుతుంది. అది మట్టిని మాత్రమే కాకుండా భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తుంది. దీంతో మన అత్యంత ఆవశ్యకమైన మూడు వనరులు (గాలి, నేల, నీరు) కలుషితం అయిపోతున్నాయి. ఒక చిన్న నిర్ల్యక్షమే ఇంత పెద్ద కాలుష్యానికి, పర్యావరణ వినాశనానికి కారణమవుతుంది.
కంపోస్టింగ్ ఎలా చేయాలి?
వాస్తవానికి తడి వ్యర్థాలు మన గృహ వ్యర్థాల్లో 60% కలిగి ఉంటాయి. ఇది మట్టికి చెందిన గొప్ప వనరు. పట్టణ ప్రాంతాల్లో కంపోస్టింగ్ కంటైనర్లలో చేసుకోవచ్చు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు సూక్ష్మజీవులను జోడించాలి. అందుకు ఆవు పేడ ఉత్తమమని వాణి సూచించింది. ఆవు పేడను నీటిలో కలిపి స్లర్రీలో వేసి కంపోస్ట్ కంటైనర్‌లో పోస్తే అద్భుతాలు చేయవచ్చని, అది అందుబాటులో లేకుంటే మజ్జిగలో కలిపిన పుల్లని పెరుగు కూడా పని చేస్తుందని తెలిపింది. అంతే కాకుండా, మీరు మీ కంపోస్ట్ కుప్పకు జోడించేందుకు కల్చర్ పౌడర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఒక పెద్ద బకెట్ కంపోస్ట్ తయారు చేయడానికి 30-40 రోజులు పట్టవచ్చు. కంటైనర్‌ను ఎల్లప్పుడూ కవర్ చేయాలని గుర్తుంచుకోండి. ఆ కంపోస్ట్ సూక్ష్మజీవులతో నిండిన సజీవ నేల. ఇది మొదటి వర్షం లాగా ఉంటుంది. ఈ గ్రహం మీద ఉన్న వ్యక్తుల సంఖ్య కంటే ఒక చేతి కంపోస్ట్‌కు ఎక్కువ జీవం ఉందన్న వాణి.. 'కంపోస్టింగ్ అనేది అనుభవపూర్వకమైన అభ్యాసం. మీరు భవిష్యత్ తరాల కోసం, భూగ్రహం కోసం ఒక ఉత్తమపని చేస్తున్నారని అనుకుంటూ దానిలో మునిగిపోండి' అని పేర్కొంది.
అవగాహన అవసరం:
మూలం వద్ద వ్యర్థాలను వేరు చేయడం జనరేటర్ బాధ్యతే. భూమి జీర్ణించుకోలేని వ్యర్థాలను ఉత్పత్తి చేసే ఏకైక జాతి మనమే. జీవించడానికి వేరే గ్రహం లేనప్పుడు, దానిని ఎందుకు నాశనం చేస్తున్నాం? అంటే దానికి సమాధానముండదు. ఒక్కసారి ఆలోచించండి విలువైన వంటగది వ్యర్థ వనరులను పల్లపు ప్రాంతాల్లో కలిసిపోకుండా చూసుకోవడం వల్ల పర్యావరణం కలుషితం కాకుండా ఆపగలం. 'కంపోస్టింగ్'పై అవగాహన లేకపోవడం దీనికి కారణం. ఎవరైనా ఇంట్లోనే కంపోస్టింగ్‌ను ప్రారంభించవచ్చు. దీని వెనుక ఒక సైన్స్ ఉంది, కానీ మీరు సాధారణ వ్యక్తిగా అర్థం చేసుకోవలసినది కంపోస్టింగ్ ఓ కళ. ఇది తడి వంటగది వ్యర్థాలు, పొడి వ్యర్థాలను సమతుల్యం చేసే కళ. ఇది కార్బన్ (పొడి వ్యర్థాల నుంచి), నత్రజని (తడి వ్యర్థాల నుంచి) నిష్పత్తిని కూడా సమతుల్యం చేస్తుంది.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రౌండ్ టేబుల్ (SWMRT) బెంగళూరు వ్యవస్థాపక సభ్యురాలైన వాణి.. 'వేస్ట్ మేనెజ్‌మెంట్' 'కంపోస్ట్ తయారీ' వంటి అంశాలపై నిత్యం ప్రచారాలు చేయడం సహా వారానికోసారి రోడ్‌షోలు నిర్వహిస్తుంటారు. 'వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్' కార్యక్రమంలోనూ భాగమైన ఆమె కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ (CSA)లో కూడా సభ్యురాలుగా ఉంది. సోషల్ మీడియా ద్వారా భవిష్యత్ తరానికి స్ఫూర్తినిస్తూ కంపోస్టింగ్ క్వీన్‌గా ప్రసిద్ధిపొందింది. టెర్రస్ గార్డెనింగ్, వానపాముల పెంపకానికి సంబంధించిన విషయాలపై కూడా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మారుస్తున్న వాణి చేస్తున్న కృషే నేషనల్ జియోగ్రాఫిక్ 'వన్ ఫర్ ఛేంజ్'కు ఎంపికయ్యేలా చేశాయి.