మహిళలకే కాదు మగాళ్లకూ గర్భనిరోధక మాత్రలు.. ఎఫెక్టివ్ రిజల్ట్స్

by Harish |
మహిళలకే కాదు మగాళ్లకూ గర్భనిరోధక మాత్రలు.. ఎఫెక్టివ్ రిజల్ట్స్
X

దిశ, ఫీచర్స్: పురుషుల కోసం రూపొందించిన ఒక కొత్త గర్భనిరోధక మాత్ర.. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో 99% ప్రభావవంతంగా పని చేసినట్లు పరిశోధకులు నివేదించారు. స్పెర్మ్ నిర్మాణంలో పాల్గొనే నిర్దిష్ట ప్రోటీన్‌కు అంతరాయం కలిగించే ఈ కొత్త రకం నాన్- హార్మోనల్ మేల్ కాంట్రాసెప్టివ్ పిల్‌తో పెద్దగా దుష్ప్రభావాలు లేవని వెల్లడించారు. ప్రస్తుతం పురుషులకు 'సింగిల్-యూజ్ కండోమ్‌ లేదంటే వాసెక్టమీ' వంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నందున ఈ పురోగతి కీలకంగా మారనుంది.

మిన్నెసోటా యూనివర్సిటీ పరిశోధకులు నేతృత్వం వహించిన ఈ కొత్త అధ్యయనం RAR-α (RAR-alpha) అనే ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రోటీన్ స్పెర్మ్ ఉత్పత్తికి సంబంధించి కణాల భేదంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎలుకల్లోని RAR-α జన్యువును క్రియారహితంగా చేసి వంధ్యత్వాన్ని కలిగిస్తుందని మునుపటి అధ్యయనాలు తెలిపాయి. అయితే కణాల్లోని RAR-αని ఎంతవరకు నిరోధించవచ్చనే విషయం తెలుసుకునేందుకు సుమారు 100 సమ్మేళనాలను పరిశీలించిన పరిశోధకుల బృందం.. చివరకు YCT529 అని పిలువబడే కాంపౌండ్‌‌ను కనుగొంది. ఇది RAR-αను ఇతర RAR సంబంధిత ప్రోటీన్ల కంటే దాదాపు 500 రెట్లు బలంగా నిరోధించింది. అంతేకాదు ఇతరత్రా దుష్ప్రభావాలు లేవని నిరూపితమైంది. ఈ చికిత్సను ఆపేసిన తర్వాత నాలుగు నుంచి ఆరు వారాల మధ్య ఎలుకలు విజయవంతంగా పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యాన్ని తిరిగి పొందినట్లు రీసెర్చర్లు తెలిపారు.

అయితే ఈ ఫలితాలు మనుషుల్లో సక్సెస్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఈ క్రమంలోనే 2022 చివరి నాటికి మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని పరిశోధకుల బృందం వెల్లడించింది. కాబట్టి త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed