పోస్టల్ శాఖలో చేప ముక్క లొల్లి.. ఎంపీ తెలుసంటూ బెదిరింపులు

by Javid Pasha |
పోస్టల్ శాఖలో చేప ముక్క లొల్లి.. ఎంపీ తెలుసంటూ బెదిరింపులు
X

దిశ, మహబూబాబాద్: ఆయన మహబూబాబాద్ డివిజన్ పోస్టల్ శాఖకు బాస్ కానీ నీచపు బుద్ధి. ఆదర్శంగా ఉండాల్సిన ఆ అధికారి పోస్టల్ శాఖకే మచ్చ తెస్తున్నాడు. ఆయనకు ఏ రాత్రి అయినా.. పగలు అయినా తినాలకుంటే హాండ్ బాక్స్‌లో చపాతీ, కొర్రమీను చేపల ఫ్రై తీసుకరావాలి. కొంచెం ఆలస్యమైనా, చేప ముక్కలు తక్కువైనా ఆయనకు ఆవేశం కట్టలు తెంచుకు వస్తుంది. బీపీఎం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఆయనకు చిన్న చూపు. పని మనుషుల కంటే హీనంగా చూసారన్న ఆరోపణలూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం టిఫిన్ బాక్స్‌లో ఓ ఉద్యోగి కొర్ర మీను ముక్కలు తక్కువగా తెచ్చాడని ఏకంగా ఉద్యోగం పీకేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా పోస్టల్ శాఖలో ఓ తిండి భకాసురుడి ఆగడాలు మితిమీరి పోతున్నాయి.

మహబూబాబాద్ డివిజన్ కేంద్రంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ హోదాలో ఉన్న అధికారి కింది స్థాయి ఉద్యోగులపై కక్షసాధింపుకు పాల్పడుతున్నాడు. ఫుడ్ పార్సెల్ నుండి మొదలుకొని అక్రమ వసూళ్ల వరకు ఆ అధికారికి అడ్డులేకుండా పోయింది. గ్రామాల్లో పోస్టల్ సేవలు అందిస్తున్న బీపీఎం ఉద్యోగులపై ఆయన వేధింపులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కొక్క బీపీఎం తన జీతం నుండి నెలకు రూ.1000 నుండి 1500 ఇవ్వాల్సిందే. బీపీఎం ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ద్వారా నిబంధనలు మేరకు రిక్రూట్ చేయాల్సి ఉండగా, అన్ని రూల్స్ బ్రేక్ చేసి తన రూల్స్ ప్రకారం ఎంపిక చేశాడు. తన వారికి, ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగస్తుల బంధువులకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక్కక్క పోస్టును వెయ్యి రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కొర్ర మీను లొల్లి..

ఇటీవల ఆ అధికారి ఓ బీపీఎంకు కొర్ర మీను చేపల కూర తెమ్మని చెప్పాడు. దాంతో సదరు బీపీఎం బాస్ ఆదేశాల మేరకు తీసుకెళ్లాడు. ఆ బాక్స్‌లో ఓ ముక్క తక్కువగా రావడంతో ఆ ఉద్యోగి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వే తిన్నావని, అందుకే తక్కువగా వచ్చాయని తిట్ల దండకం ప్రారంభించాడు. అదే ఉద్యోగిపై కొన్ని రోజులుగా ఇతర వంటకాలు తెమ్మని టార్చర్ పెడుతున్నాడు. ఓ పర్యాయం నా దగ్గర డబ్బులు లేవని చెప్పగా అప్పటి నుండి అక్కసుతో ఉండి సోమవారం ఆ ఉద్యోగిని తొలగించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు.

ఎంపీ కవిత మాకు దగ్గరి బంధువు..

నాకు ఎంపీ కవిత దగ్గరి బంధువు అంటూ ఉద్యోగులపై అజమాయిషీ ప్రదర్శిస్తున్నాడు పోస్టల్ శాఖ బాస్. ప్రతి రోజు వాట్సప్ గ్రూప్‌లో ఎంపీ కవితను కలిశానని ఆయన ఫోటోలు పెడుతూ, మీ ఉద్యోగాలు పీకేయడం పెద్ద లెక్క కాదని బాహాటంగానే చెబుతున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

గతంలో సస్పెన్షన్..

నర్సంపేటలో పని చేసిన అదే ఉద్యోగి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్‌కు గురయ్యాడు. రెండు సార్లు అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నో సార్లు చర్యలు తీసుకున్నా ఆయనలో మార్పు మాత్రం రావడం లేదు.

47 మంది నుండి..

పోస్టల్ డివిజన్ పరిధిలో 47 మంది అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి వద్ద నుండి నెలకు రూ.2000 కమిషన్ వసూళ్లు చేస్తున్నాడు. నెలకు సుమారుగా ఒక లక్ష రూపాయలు కమిషన్ లు వస్తున్నాయి. విందులకు, కమిషన్ లకు డబ్బులు ఇవ్వలేక బీపీఎం ఉద్యోగులు సతమతమవుతున్నారు.

విచారణ చేస్తే ఆయనది ఓ చరిత్ర..

రహస్య విచారణ చేస్తే ఆ అధికారి అక్రమాలది ఓ చరిత్ర. ఆయన గూర్చి చెప్పాలంటే ఉద్యోగులు జంకుతున్నారు. ఆయన పొలిటికల్ పవర్‌తో ఇబ్బందులు పెడతారని చాలా మంది బాధితులు నేరుగా చెప్పలేక, మింగలేక లోలోపల కుమిలిపోతున్నారు. అధికారి పై విచారణ చేసి చర్యలు తీసుకోవడంతో పాటు ,ఆయన వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed