ఎల్ఐసీ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే!

by Harish |
ఎల్ఐసీ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరంలోపు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనూహ్యంగా మొదలైన రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల ఐపీఓకు కష్టాలు తప్పేలా లేవు. గత నెలలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద డ్రాఫ్ట్ ఫైల్ సమర్పించిన తర్వాత మార్చి10న ఐపీఓకు సిద్ధమైందని వచ్చిన వార్తల అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. యుద్ధ వాతావారణంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వేళ ఐపీఓకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఐపీఓ తేదీ విషయంలో పునరాలోచించాలన్నారు. దీనికి సంబంధించిన అధికారులు సైతం ఎల్ఐసీ ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఇప్పుడున్న పరిస్థితుల మధ్య ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఐపీఓ రావొచ్చని తెలిపారు. బ్యాంకర్లతో పాటు, అధికారులు కూడా ఏప్రిల్ 1 తర్వాతే ఐపీఓను తెచ్చేందుకు ప్రణాళికను కలిగి ఉన్నట్లు వివరించారు. దీన్ని రాబోయే వారంలో అధికారికంగా ప్రకటించవచ్చని బ్లూమ్‌బర్గ్ సైతం వెల్లడించింది. ఇదే సమయంలో ఒకవేళ పరిస్థితులు సానుకూలంగా మారి, స్టాక్ మార్కెట్లు పుంజుకుంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై అధికారికంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఎల్ఐసీ గానీ స్పందించలేదు.

Advertisement

Next Story