ఆ జిల్లాలో పెద్ద ఎత్తున భూ సమస్యలు పెండింగ్.. కారణం అదేనా?

by Web Desk |
ఆ జిల్లాలో పెద్ద ఎత్తున భూ సమస్యలు పెండింగ్.. కారణం అదేనా?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉంది. దీంతో ఈ జిల్లాలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. భూ సమస్యలను పరిష్కరించాలని నిత్యం పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఏదో ఒక్క చోట భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భూ కబ్జాదారులు ఏదో ఒక వివాదానికి ఆజ్యం పోస్తుంటారు.

ఒకవైపు ప్రభుత్వ భూములలో అక్రమంగా ఇండ్లను నిర్మించి బకాసురులు విక్రయిస్తుండగా, మరోవైపు అక్రమ లే అవుట్లు వేసి విలువైన భూములను హాంఫట్ చేస్తున్నారు. కాగా ఇలాంటి క్లిష్టమైన సమస్యలను హ్యాండిల్ చేసేందుకు జిల్లాకు రెగ్యులర్ కలెక్టర్ ను ప్రభుత్వం నియమించకపోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు 15 నెలలుగా ఇన్ ఛార్జ్ కలెక్టర్లనే కొనసాగిస్తున్నారు.

పెద్ద సవాలే..

పేదల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమ బధ్దీకరించేందుకు రాష్ట్ర సర్కార్ 58, 59 జీవోలను జారీ చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇదే జిల్లాలోని జవహర్ నగర్ లో జరిగిన సభలో ఆ రెండు జీవోలను మళ్లీ తెస్తామని ప్రకటించారు. మంత్రి చెప్పినట్లుగానే ప్రభుత్వం 58, 59 జీవోలను విడుదల చేసింది. దీంతో (ఈ నెల 21 నుంచి) సోమవారం నుంచి ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హులైన వారికి ప్రభుత్వం పట్టాలను జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఏ చిన్న పొరపాట్లు జరిగిన ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకునే పరిస్థితి లేకపోలేదు.

15 నెలలుగా ఇన్ చార్జీలే దిక్కు..

జిల్లాలో అత్యంత కీలకమైన కలెక్టర్ పోస్టు 15 నెలలుగా ఖాళీగా ఉంది. గతేడాది నవంబర్ 14వ తేదీన ఇక్కడి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్ ను నియమించక పోగా, నాటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆగస్టు 12, 2021 వరకు శ్వేతా మహంతి ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా 9 నెలలు పనిచేశారు.

రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ తో పాటు మేడ్చల్ జిల్లాను సైతం హ్యాండిల్ చేయడం తో ఆమెపై పని భారం పెరిగింది. ధరణి ఫైళ్లను క్లియర్ చేసేందుకు శ్వేతా మహంతి ఆఫీస్ లోనే రాత్రి పొద్దు పోయే వరకు పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. కాగా శ్వేతా మహంతి అమెరికాలోని హార్వర్డ్ వర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమెను విధుల నుంచి రిలీవ్ చేస్తూ.. మెదక్ కలెక్టర్ ఎస్. హరీశ్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 13, 2021 నుంచి హరీశ్ మేడ్చల్ ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇలా జిల్లాకు 15 నెలలుగా ఇన్ ఛార్జ్ కలెక్టర్ల పాలనే నడుస్తోంది. అయితే ప్రస్తుతం జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్ ను నియమిస్తారనే ఊహాగనాలు ఊపందుకున్నాయి.

ప్రస్తుత ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా ఉన్న హరీశ్ నే రెగ్యులర్ కలెక్టర్ గా నియమిస్తారని చర్చ నడుస్తోంది. కలెక్టరేట్ లో ఏ ఇద్దరు అధికారులు, సిబ్బంది కలిసిన ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోనే కీలకమైన జిల్లా కావడంతో ఈ సారి పూర్తి స్థాయి కలెక్టర్ ను నియమిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భూ సమస్యలు పెండింగ్..

పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు భూముల వివాదాలను పరిష్కరించేందుకు గతంలో ఉన్న తహశీల్దార్, ఆర్‌డీఓ, జేసీ కోర్టులను రద్దు చేసింది. వారి వద్ద పెండింగ్ లో ఉన్న కేసులన్నింటినీ జిల్లా స్థాయిలోనే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేసింది. జిల్లాలో రెగ్యులర్ కలెక్టర్ లేనందున కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం నెలకొంటుంది.

ప్రస్తుతం ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ హరీష్ మెదక్ జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్నారు. దీంతో ఆయన పాలన పరమైన వ్యవహారాల్లో మెదక్ లోనే బీజీబీజీగా గడుపుతున్నారు. మేడ్చల్ జిల్లాకు వారానికి రెండు, మూడు సార్లు వచ్చి పోతున్నారు. జిల్లాకు వచ్చిన రోజునే పెండింగ్ ఫైళ్లన్నీ క్లియర్ చేసేందుకు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. జిల్లాలో మెజారిటీ శాఖలకు చెందిన ఫైళ్లు చాలా వరకు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లాకు పూర్తి స్థాయి కలెక్టర్ ను నియమించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed