అవి వాడకపోవడమే మంచిది... లేకపోతే మీ వర్ఛస్సు..

by S Gopi |   ( Updated:2022-04-03 07:25:24.0  )
అవి వాడకపోవడమే మంచిది... లేకపోతే మీ వర్ఛస్సు..
X

దిశ, ఫీచర్స్: వేసవిలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలే కాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. ప్రధానంగా మొటిమలు, జిడ్డు చర్మం బాధిస్తుంటాయి. అయితే వీటిని అధిగమించేందుకు రసాయన ఆధారిత సౌందర్య ఉత్పత్తుల వైపు మొగ్గుచూపుతారు లేదా పార్లర్‌‌‌పై ఆధారపడతారు. ఇలాంటి పద్ధతులను ఇష్టపడని వ్యక్తులు తమకు తెలిసిన నేచురల్ టిప్స్ పాటిస్తుంటారు. సహజ ఉత్పత్తులు చర్మానికి ఎటువంటి హాని కలిగించవని అపోహపడుతూ వంటింట్లో లభించే పదార్థాలను క్లెన్సర్‌, స్క్రబ్‌, టోనర్, ఫేస్ మాస్క్‌లుగా వినియోగిస్తున్నారు. అయితే అనేక వంటగది పదార్థాలు ముఖంపై పూసేందుకు తగినవి కావని, అలా చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు తప్పవని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ పదార్థాలేంటో తెలుసుకోవడంతో పాటు వేసవిలో చర్మ సంరక్షణకు ఏం చేయాలో తెలుసుకుందాం.

నిమ్మకాయ:

నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పిగ్మెంటేషన్ సమస్యలను పరిష్కారానికి, చర్మాన్ని కాంతివంతం చేసేందుకు చాలా మంది దీన్ని నేరుగా ముఖంపై ఉపయోగిస్తారు. అయితే అధిక ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండే నిమ్మకాయ.. పీహెచ్(pH) బ్యాలెన్స్‌కు భంగం కలిగించడంతో పాటు తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. అదే సున్నితమైన చర్మముంటే లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల నేరుగా కాకుండా ఉత్తమ ఫలితాల కోసం ఫేస్ మాస్క్‌లలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని ఉపయోగించి అప్లయ్ చేసుకోవచ్చు.

వైట్ షుగర్:

చాలామంది 'వైట్ షుగర్'ను స్క్రబ్‌లా ఉపయోగిస్తుంటారు. కానీ ముఖంపై రాసుకున్నప్పుడు వాటి పదునైన అంచులు సున్నితమైన ముఖ కణజాలాలను దెబ్బతీస్తాయి. చర్మఉపరితలం ఇరిటేషన్‌కు గురవడంతోపాటు ఎర్రగా కందిపోతుంది. ఈ మేరకు పొడిబారడమే కాక ఇతర చర్మ సమస్యలకు దారితీయొచ్చు. ఇక మొటిమల సమస్యతో ఇబ్బందిపడే వ్యక్తులు తెల్ల ఉప్పు లేదా చక్కెరను ఎప్పుడూ ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

వంట సోడా:

బేకింగ్ సోడాతో ముఖాన్ని కడుక్కోవడం లేదా ఫేస్ మాస్క్ /స్క్రబ్‌లా ఉపయోగించడం చేస్తుంటారు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్స్, మొటిమల బారినపడే అవకాశం ఉంది. బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల చర్మం సున్నితంగా మారి, సూర్యరశ్మి తగిలితే హైపర్‌పిగ్మెంటేషన్‌కు దారితీయొచ్చు. ఇక బేకింగ్‌ సోడా పీహెచ్‌ విలువ 8కి పైనే ఉంటుంది. అంటే ఆల్కలైన్ (క్షార) గుణాలు అధికంగా ఉండే సోడాను ముఖానికి అప్లై చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చర్మంలో నీటి స్థాయిలను తగ్గించి ముఖ వర్ఛస్సును తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క:

గొప్ప రుచి, సువాసనకు పేరుగాంచిన దాల్చిన చెక్కను వంటకాల్లోనే కాదు సౌందర్య సాధనలోనూ ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని నేరుగా ముఖంపై రాయకూడదు. ఎందుకంటే చర్మం పీహెచ్‌ స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నీటి స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఫలితంగా ముఖంపై దద్దుర్లు, మంట, చర్మం రంగు మారిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాకపోతే మృదువైన, మచ్చలు లేని చర్మం కోసం తేనె, ఆలివ్ ఆయిల్ మొదలైన వాటితో దాల్చిన జోడించి వాడుకోవచ్చు.

కూరగాయల నూనెలు:

వెజిటెబుల్ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల మీ చర్మం ఉపరితలంపై కొంత అదనపు తేమను జోడించవచ్చు, కానీ దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉండటంతో మొటిమలు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా, శుద్ధి చేసిన నూనెలు రసాయనాలతో ప్రాసెస్ చేస్తారు అందువల్ల వాటిని ముఖంపై ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, కోల్డ్ ప్రెస్డ్, ఆర్గానిక్ ప్లాంట్ ఆధారిత నూనెలను మాత్రమే నిపుణుల సలహాతో ఉపయోగించాలి.

యాపిల్ సైడర్ వెనిగర్:

బరువుతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గించే యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ముఖానికి రాయడం వల్ల ఇరిటేషన్‌, మంట పుడుతుంది. దీంట్లోనూ పీహెచ్‌ విలువ 2-3 మధ్యలో ఉంటుంది. ఆమ్ల గుణాలు అధికంగా ఉండటం వల్ల దీన్ని చర్మసంరక్షణలో వాడకపోవడమే మంచిది.

మెరుపు కోసం

మనం తీసుకునే ఆహారం కూడా ముఖ వర్ఛస్సుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచుకునేందుకు, మెరుపుదనం సొంతం చేసుకునేందుకు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో విరివిగా లభించే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఫలితంగా మెరిసే చర్మం సొంతమవుతుంది. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్(ఎస్‌పీఎఫ్ 30) రాసుకోవాలి.

ఐస్‌క్యూబ్స్‌తో:

చల్లని నీటితో లేదా ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని కడిగితే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఐస్‌ను ముఖంపై రుద్దితే చర్మానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై ముఖం కాంతివంతం అవుతుంది. ఐస్ వాటర్ ఫేషియల్.. మొటిమలు, బ్రేకవుట్స్‌ను తగ్గించడంతో పాటు ముఖంపై ఉత్పత్తయ్యే నూనెను నియంత్రించడంలో దోహదపడుతుంది.

చల్లచల్లని మిలన్ :

పుచ్చకాయ జ్యూస్‌ను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత దాంట్లో ఓ వస్త్రాన్ని లేదా కాటన్ బాల్‌‌ను ముంచి దాంతో ముఖానికీ రాసుకోవాలి. ఓ పదినిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. వాటర్ మెలన్‌లోని విటమిన్‌ సి ముఖానికి పోషకాలను ఇవ్వడంతోపాటు వృద్ధాప్య ఛాయలను దరి చేరనీయదు.

Advertisement

Next Story

Most Viewed