కూలీల బ్రతుకులు మార్చని కేసీఆర్‌తో బంగారు భారత్ ఎలా సాధ్యం: బీకేఎంయు

by Disha News Desk |
కూలీల బ్రతుకులు మార్చని కేసీఆర్‌తో బంగారు భారత్ ఎలా సాధ్యం: బీకేఎంయు
X

దిశ, కొమురవెల్లి: పేద ప్రజలకు కడుపునిండా తిండి పెట్టె ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో సక్రమంగా నిర్వహించలేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశాన్ని బంగారు దేశంగా మారుస్తానని గొప్పలు చెప్పడం మానుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, బికేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క బాల మల్లేష్, డి బిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి స్వామి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల గ్రామాన్ని, కొమురవెల్లి మండలంలోని రాం సాగర్ గ్రామాన్ని ఈ బృందం సోమవారం సందర్శించింది.

అక్కడ ఉపాధి హామీ పనులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, కూలీలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది, వేతనాలు ఏవిధంగా పంపిణీ చేస్తున్నారు, వ్యవసాయ కార్మికుల స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం కొమరవెల్లి మండల కేంద్రంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్ వెంకట రాములు, నక్క బాల మల్లేష్, దాసరి ఏ గొండ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలలో ఉపాధి హామీ పనులు నత్తనడక నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించే ఈ పనుల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. గతంలో గ్రామానికో ఫీల్డ్ అసిస్టెంట్ ఉండీ పనులను నిర్వర్తించే వారని, వారిని కేసీఆర్ సర్కార్ తొలగించిందని అన్నారు.

ఈ రకంగా రాష్ట్రంలో 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పనుల్లో కనీస కూలీలు రూ.100-150 వరకే ఉన్నాయిని, ఈ వేతనం కూడా పని చేసిన మూడు నెలల వరకూ ఇవ్వడం లేదని అన్నారు. పూర్తిగా ఉపాధి హామీ పనులపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు వంద రోజులు నిండడంతో పని లేకుండా పోతుందని చెప్పారు. ప్రస్తుతం పనులు లేక కూలీలు గ్రామాల్లో పస్థుల ఉంటున్న పరిస్థితి ఉందని, పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా రోజు కూలీ రాబోయే రోజుల్లో రూ.600 కు పెంచాలని, ప్రతి కుంటుంబానికి 200 దినాలు పని కల్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉపాధి హామీ నిధులను ఇతర పనులకు మల్లిస్తూ పేదల నోటికాడి కూడును కేసీఆర్ ప్రభుత్వం లాగేస్తుందని, అదేవిధంగా గ్రామాల్లో ఎకరం, అర ఎకరం ఉన్న అసైన్డ్ భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ధరణి వెబ్సైట్ తెచ్చి పేదల భూములు పేదలకు దక్కకుండా అడ్డు పడుతుందని, ఈ విధానాలు మార్చుకోవాలని, అదేవిధంగా 2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను గత ఏడాది కన్నా తక్కువగా కేటాయించి పేద ప్రజలకు పనులు లేకుండా చేసే రకంగా మోడీ ప్రభుత్వం చూస్తోందన్నారు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఏకమై పేద ప్రజల నడ్డివిరిచే పనిలో ఉన్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బి కే ఎన్ యు రాష్ట్ర అధ్యక్షులు కొక్కొండ కాంతయ్య సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట్ మావో, రాంసాగర్ గ్రామ సర్పంచ్ తాడూరి రవీందర్, గిరి భూమయ్య, అందే అశోక్, గొర్రె శ్రీనివాస్, గుండ రవీందర్ ,తాడూరి మల్లేశం ,పుల్లంపల్లి సాయిలు, కనుకుంట్ల శంకర్, కుడికాల బాలమోహన్, ఒక్కటి సంపత్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed