వడ్డీ వ్యాపారుల పడగ నీడలో కరీంనగర్.. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి

by Mahesh |
వడ్డీ వ్యాపారుల పడగ నీడలో కరీంనగర్.. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: 2018లో కుటుంబ అవసరాల కోసం కరీంనగర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన మధురమ్మ తన ఇంటిని తనఖా పెట్టి రూ. 5 లక్షలు అప్పు తీసుకుంది. వడ్డీ వ్యాపారులు రూ.2, రూ.3 వడ్డీ చెల్లించాలంటూ వేర్వేరుగా అగ్రిమెంట్ పేపర్లు రాయించుకున్నారు. ప్రతి నెల వడ్డీ కోసం 2.64 లక్షలు చెల్లించింది. కరోనా లాక్ డౌన్ కారణంగా డబ్బులు చెల్లించ లేకపోయింది. తరుచూ ఫైనాన్సర్లు ఇంటికి వచ్చి గొడవకు దిగడంతో మధురమ్మ పెద్ద కొడుకు వేణు మానసిక క్షోభతో గుండెపోటు రావడంతో మరణించాడు. అయినా ఫైనాన్సర్లు మాత్రం తమ వేధింపులు ఆపకుండా మరో ఫైనాన్స్ వద్దకు తన భర్త గోపయ్యను తీసుకెళ్లి బ్లాంక్ చెక్కులపై సంతకాలు చేయించుకొని రూ.8 లక్షలు అప్పు ఇప్పిస్తున్నామని చెప్పారు.

అయితే ఇప్పుడు ఫైనాన్సర్లు వచ్చి రూ. 4.75 లక్షలు మాత్రమే వచ్చాయని చెప్పారు. తమకు ఇంకా 1.70 లక్షల పైచిలుకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని వేధింపులకు గురి చేస్తున్నారని మధురమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫైనాన్సర్ల ఆగడాలను కట్టడి చేసి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కరీంనగర్ సీపీని ఆశ్రయించింది. ఇలా నిత్యం వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. మధురమ్మ లాంటి బాధితులు గత కొంతకాలంగా పోలీసులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. మూడు రోజుల క్రితం కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు దాడులు చేసిన తర్వాత మరింత ఎక్కువ మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకునేందుకు క్యూ కడుతూనే ఉన్నారు.

రెండు దశాబ్దాలకు పైగా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఫైనాన్షియర్‌లు , అక్రమ వడ్డీ వ్యాపారులు సామాన్యులతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. 1995 ప్రాంతంలో కూడా ఫైనాన్స్‌లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చిన్న చితక అవసరాలకు డబ్బులు ఇచ్చి ఫైనాన్సర్లు చక్రవడ్డీలు వేస్తూ సామాన్యులను నిలువు దోపిడీ చేశారు. అప్పటి ఎస్పీ ఉమేష్ చంద్ర ఫైనాన్సర్లపై ఉక్కుపాదం మోపడంతో ఫైనాన్స్‌లు మూతపడ్డాయి. ఆ తర్వాత ప్రైవేటు ఫైనాన్సుల ఉనికి గణనీయంగా తగ్గిపోయింది. కొంతకాలం తర్వాత లైసెన్సులు తీసుకోకుండా అధిక వడ్డీలు వేస్తూ నిండా ముంచే పనిలో నిమగ్నమయ్యారు.

దాదాపు ఆరేళ్ల క్రితం కూడా రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా హుజురాబాద్, జమ్మికుంట పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 70 వరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. తిరిగి మూడు రోజుల క్రితం కమిషనరేట్ వ్యాప్తంగా దాడులు నిర్వహించిన పోలీసులు పది కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కూడా పోలీసులు దాడులు చేశారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరి పోయాయి. లైసెన్స్ తీసుకోకుండానే ఫైనాన్సర్లు వడ్డీలపై వడ్డీలు వేస్తూ ప్రభుత్వానికి ట్యాక్సులు ఎగరేస్తూ యథేచ్ఛగా మనీ లాండరింగ్ యాక్టును తుంగలో తొక్కుతున్నారు. లీగల్ గా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. చాలామంది మాత్రం బ్లాంక్ ప్రామిసరీ నోట్లు, ఖాళీ నాన్ జ్యుడీషియల్ స్టాంప్స్, బ్లాంక్ చెక్కుల పై సంతకాలు చేయించుకుంటున్నారు.

అప్పు తీసుకున్న వారు డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చిన డబ్బులకు రెట్టింపు చేసి వడ్డీ లేకుండా రుణం ఇచ్చామని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం, ప్రభుత్వానికి టాక్స్ కట్టే అవసరం లేకుండా పోయింది. ఇలా ఎదో రకంగా డబ్బులతో వ్యాపారం చేస్తున్న వారు వేలల్లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed