భారత్‌లో జపాన్ భారీ పెట్టుబడులు.. ఐదేళ్లలో లక్షల కోట్లు

by Javid Pasha |
భారత్‌లో జపాన్ భారీ పెట్టుబడులు.. ఐదేళ్లలో లక్షల కోట్లు
X

న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో భారత్‌లో జపాన్ ఐదు ట్రిలియన్ యెన్‌లు (సుమారు రూ.3.20 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా 14వ ఇండియా- జపాన్​ద్వైపాక్షిక సదస్సులో ఫుమియో కిషిదా, మోదీ శనివారం భేటీ అయ్యారు. దేశరాజధానిలోని హైదరాబాద్​హౌస్‌లో ఈ సమావేశం జరగగా పీఎంవో కార్యాలయం భేటీ సారాంశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 'ద్వైపాక్షిక సదస్సులో భాగంగా ఇండో-పసిఫిక్​సహా ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం గురించి చర్చ జరిగింది.'జపాన్‌తో ఉన్న స్నేహబంధం మరింత బలోపేతం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కిషిదా మధ్య న్యూఢిల్లీలో ఉత్పాదక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు' అని పీఎంవో తెలిపింది.

ఉక్రెయిన్‌కే టోక్యో మద్దతు :

రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో తమ మద్దతు ఉక్రెయిన్‌కే ఉంటుందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అంతర్జాతీయ క్రమం యొక్క మూలాలను కదిలించే తీవ్రమైన సమస్యగా అభివర్ణించారు. బలాన్ని ఉపయోగించి ప్రపంచ క్రమంలో యథాతథ స్థితిని మార్చడానికి ఒక దేశానికి అనుమతి ఇవ్వకూడదని కిషిదా వెల్లడించారు. టోక్యో మద్దతు ఉక్రెయిన్‌కే ఉంటుందని ప్రధాని మోడీ సమక్షంలో మరోసారి స్పష్టం చేశారు. ఇదిలాఉండగా భారత్ మాత్రం యూఎన్‌వోలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed