కలియుగ రావణాసురుడు జగన్.. అక్రమాలు, అరాచకాలే పది తలలు: టీడీపీ

by Javid Pasha |   ( Updated:2022-04-08 11:06:33.0  )
కలియుగ రావణాసురుడు జగన్.. అక్రమాలు, అరాచకాలే పది తలలు: టీడీపీ
X

దిశ, ఏపీ బ్యూరో : 'ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రజాకంటక నిర్ణయాలు ప్రశ్నిస్తున్నందుకే ఆయన కళ్లకు మేము రాక్షసుల్లా కనిపిస్తున్నామా? దొంగే దొంగదొంగ అన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఉన్న గజదొంగ వైఖరి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసినందుకు జనం నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. వారి ఏడుపుకి సమాధానం చెప్పలేక ఆయన ప్రతిపక్షంపై పడి ఏడుస్తున్నాడు' అని టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మద్యం దోపిడీ.. ఇసుక కుంభకోణం.. భూకబ్జాలు.. ఖనిజ సంపద లూటీ లాంటి పది తలలతో పాలన చేస్తున్న కలియుగ రావణాసురుడు జగన్ రెడ్డి అని తీవ్ర విమర్శలు చేశారు.

ఉద్యోగులు రోడ్డెక్కినా.. అంగన్ వాడీలు, ఆశావర్కర్లు కన్నీరుపెట్టుకున్నా.. మహిళలపై అత్యాచారాలు జరిగినా.. పోలవరం పనులు ఆగిపోయినా.. రాజధాని నాశనమైనా అన్నింటికీ చంద్రబాబునాయుడే కారణమా? అంటూ ధూళిపాళ్ల నిలదీశారు. జగన్ రెడ్డి నరం లేని నాలుక ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారులే అనుకుంటోంది. ఆయన అవినీతి, దోపిడీ, అబద్ధాలు.. తనవారికి దోచిపెట్టే నైజంతో ఏపీ కూడా శ్రీలంకలా చిన్నాభిన్నమై సముద్రగర్భంలో కలిసి పోవడం ఖాయం అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హెచ్చరించారు.

జగనాసురుడి దెబ్బకు అంధకారంలో రాష్ట్రం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేకుండా పోతుందంటూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఆ హామీని నిలబెట్టుకోకపోగా గతంలో ఇంటెరిమ్ రిలీఫ్ కింద ఉన్న 27శాతం పీఆర్సీని తగ్గించారంటూ విమర్శించారు. ఏ ఉద్యోగులైతే తాము కుడిచేత్తో, ఎడంచేత్తో జగన్ రెడ్డికి ఓట్లేశామని చెప్పారో వారే రోడ్లపైకి వచ్చి ఏడుస్తున్నారంటూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. 23 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రం నుంచి పోలవరం నిర్మాణానికి నిధులు తేలేకపోయారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేకపోయాడు.

నాడు బాదుడే బాదుడు అన్న జగన్ నేడు ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన దోపిడి, అవినీతి కోసం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశాడు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో పరిశ్రమలకు ఒక్కరోజైనా పవర్ హాలిడే ప్రకటించామా? విద్యుత్ రంగాన్ని బలోపేతంచేసి, మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని జగన్ రెడ్డికి అప్పగించాం. అయితే విద్యుత్ రంగంతోపాటు మొత్తం రాష్ట్రాన్నే సీఎం జగన్ నాశనం చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలు ఏడవక తప్ప ఇంకేమి చేస్తారంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు రాక్షసులు.. మారీచులు.. దుర్మార్గులు కాదని అయితే అవినీతిపరుడు, దోపిడీ దారుడికి అందరూ అలానే కనిపిస్తారంటూ సెటైర్లు వేశారు.

జగనాసురుడు అనే రాక్షసుడి దెబ్బకు రాష్ట్ర ప్రజానీకమంతా చిగురుటాకులా వణికిపోతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీ కాలర్ పట్టుకోవాలంటూ నాడు పిలుపునిచ్చిన జగన్ ఇప్పుడెందుకు ఆ పనిచేయడం లేదో చెప్పాలని నిలదీశారు. జగన్‌ ఢిల్లీలో మోడీని కలవగానే కడపలో సీబీఐ అధికారులు ఉంటున్న గెస్ట్ హౌస్‌లను కూడా ఖాళీచేయించి, వారిని బయటకు పంపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే జగన్మోహన్ రెడ్డికి మేం మారీచుల్లా కనిపిస్తున్నాము. నేరాలు ఘోరాల్లో ఏపీ 12వ స్థానంలో ఉండే ఏపీ ఇప్పుడు 6వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎవరు మారీచులో, రాక్షసులో తెలిసిపోతుంది అంటూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎద్దేవా చేశారు.

శివాలయంలో మాంసం వండిస్తారా?

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులేమో మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే, గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పారు. గన్ లేదు.. బుల్లెట్ లేదు....రోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏనాడూ పట్టించుకున్నది లేదు. జగన్ సీఎం అయ్యాక ఈ మూడేళ్లలో ఆడబిడ్డలు, చిన్నారులపై 1500లకు పైగా అఘాయిత్యాలు జరిగితే , వాటికి కారకులైన వారిలో ఈ జగన్ రెడ్డి కనీసం 15 మందిని కూడా శిక్షించ లేకపోయాడు. నిన్నటి వరకు దేవాలయాలు, విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చివరకు హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆలయాల్లో మాంసం వండించేవరకు వచ్చింది. పెదకాకాని శివాలయంలో మాంసం వండిన ఘటనలో ఈ ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంటోందో చెప్పాలి అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.

పాఠశాలలకు రంగులేయడం తప్ప ఏం అభివృద్ధి చేశారు?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. విదేశీ విద్య పథకానికి తూట్లు పొడిచారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఎత్తేశారు. కుటుంబంలో ఒకరికి అమ్మఒడి ఇస్తే.. అదే కుటుంబంలో ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఇక స్కాలర్ షిప్ ఉండదు. విద్యారంగం రూపురేఖలు మార్చామని డబ్బాలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు తన పార్టీ రంగులేయడం తప్ప ఈ మూడేళ్లలో ఏం మార్చాడో సమాధానం చెప్పగలడా? అని ప్రశ్నించారు. చివరికి ఉపాధ్యాయులను తీసుకెళ్లి మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టి.. వారితో మద్యం అమ్మించాడు అని ఆరోపించారు. ఈ మూడేళ్లలో వ్యక్తిగతంగా ప్రజలను, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేమైనా చేశారా అని నిలదీశారు.

బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్‌ను రావణరాజ్యమైన శ్రీలంకలా మార్చేశాడు. పది అవినీతి తలల రావణుడు జగనాసురుడు అనే రాక్షసుడి దెబ్బకు ఈ రాష్ట్రం, 5 కోట్లమంది ప్రజల కూడా ఏదో ఒక రోజు శ్రీలంక మాదిరే చిన్నాభిన్నమై, సముద్రగర్భంలో కలిసిపోవడం ఖాయం. ప్రజల్లో తనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిసే, తన వైఫల్యాలను, పాలనాలోపాలను కప్పిపుచ్చుకోవడానికు జగన్ రెడ్డి ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలను రాక్షసులని చెబుతూ, తనకు తాను దైవాంశ సంభూతడని బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. దొంగే ఎదుటివారిని పట్టుకొని దొంగదొంగ అనడం. దోపిడీదారులు.. అవినీతిపరులు.. కబ్జాకోరులు.. రాక్షసులు.. టెర్రరిస్ట్ లే ప్రభుత్వంలో ఉన్నారు. వారికళ్లకు ఎదుటివారు కూడా అలానే కనిపిస్తుంటారంటూ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed