గే ఫాదర్స్.. బెస్ట్ క్వీర్ పేరెంట్స్‌గా తమిళియన్ - ఇటాలియన్

by Mahesh |   ( Updated:2022-05-04 07:52:01.0  )
గే ఫాదర్స్.. బెస్ట్ క్వీర్ పేరెంట్స్‌గా తమిళియన్ - ఇటాలియన్
X

దిశ, ఫీచర్స్ : జీవకోటిలో మానవులే కాదు ప్రతి జీవి కూడా మాతృత్వాన్ని, పితృత్వాన్ని అనుభవించడంతో పాటు పిల్లల ఆలనా పాలనా బాధ్యత‌ను తీసుకుంటాయి. కానీ ఎంతైనా అనుక్షణం ఆరో ప్రాణంగా చూసుకునే అమ్మ ప్రేమ ముందు, కంటికి రెప్పలా కాపాడే నాన్న ప్రేమ కాస్త చిన్నదిగా కనిపిస్తుంది. కానీ కాలం మారింది.. ఈ తరం నాన్నలు అమ్మను మించి పిల్లలకు దగ్గరవుతున్నారు. అంతేకాదు ఈ రోజుల్లో ఒక బిడ్డకు 'ఇద్దరు తండ్రులు' లేదా 'ఇద్దరు అమ్మలు' ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనదేశంలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతుండగా 'గే ఫాదర్‌హుడ్'‌కు ఎంతోమంది సాక్ష్యంగా నిలుస్తున్నారు. బుజ్జగించడం నుంచి లాలి పాటలు పాడుతూ నిద్రపుచ్చే వరకు.. తల్లి లోటు తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తమమైన 'క్వీర్ పేరెంటింగ్'‌‌తో స్వలింగ సంపర్కులైన విఘ్నేష్-ఆండ్రియా.. ఇండియా, ఆస్ట్రేలియా వాసుల మనసు దోచుకుంటున్నారు‌. సోషల్ మీడియాలో 'డాన్స్ ఆఫ్ మీనాక్షి' గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ గే ఫాదర్స్ పితృత్వ ప్రయాణ విశేషాలు..

సంప్రదాయ తల్లిదండ్రులతో పోల్చితే స్వలింగ సంపర్కులు.. తండ్రులుగా మారడం కష్టతరమైన ప్రక్రియే కావచ్చు కానీ పితృత్వపు సంతోషాన్ని వారు మనసారా ఆస్వాదిస్తున్నారు. దత్తత, సరోగసీ, ఎగ్ డోనర్స్ సహాయం ద్వారా తమ కలను నిజం చేసుకుంటూ సొంత కుటుంబాన్ని ఏర్పరచుకుంటున్నారు. అయితే మగాళ్లకు ఓపిక తక్కువని, పిల్లల ఆలనా పాలన చూసుకోవడం రాదని, అయినా ఇద్దరు మగాళ్లు పిల్లలను ఎలా పెంచుతారంటూ సమాజం నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ వాటన్నింటికీ తమ బాధ్యతాయుతమైన 'ఫాదర్‌హుడ్'తో సమాధానం చెబుతున్నారు ఈతరం 'గే' ఫాదర్స్. అదే సమయంలో ఇరవై ఒకటో శతాబ్దపు కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులకు సాక్ష్యంగా నిలుస్తూ 'మోడ్రన్ ఫ్యామిలీ' కి కొత్త అర్థాన్ని ఇస్తున్నారు. ఆస్త్రేలియాలో కూతురు మీనాక్షి తో అందమైన లైఫ్ లీడ్ చేస్తున్న ఈ జంట, తమ సోషల్ మీడియా పేజ్ 'డాడ్స్ ఆఫ్ మీనాక్షి' లో చిన్నారికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తుంటారు. ఆస్ట్రేలియాలో 'యాక్టివ్ గే పేరెంట్ నెట్‌వర్కింగ్ గ్రూప్‌' మెయింటెయిన్ చేస్తున్న వీరు.. గే పేరెంట్స్ మనోభావాలు, అనుభవాలను ఈ వేదికగా పంచుకుంటున్నారు.

పరిచయం.. ప్రేమగా ..

ధురైకి చెందిన విఘ్నేష్ పైచదువుల నిమిత్తం న్యూజిలాండ్‌‌కు వెళ్లగా, అక్కడే తొలిసారిగా ఆండ్రియాను కలిశాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం తో కొద్దికాలం పాటు కలిసి జీవించి ఆ తర్వాత ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల క్రితం సరోగసీ ద్వారా బిడ్డను పొందిన స్వలింగ సంపర్కుల జంట ఫొటోను చూపిస్తూ, తనకు కూడా తండ్రి కావాలనే కోరిక ఉందని తన గే పార్టనర్ ఆండ్రియాతో విఘ్నేష్ పంచుకున్నాడు. దీంతో ఆ ఇద్దరూ ఓ బిడ్డను దత్తత తీసుకునేందుకు ప్రయత్నించి విఫలం కాగా సరోగసి ద్వారా పేరేంట్స్ అయ్యారు. ఆ గే జంటకు పుట్టిన బిడ్డే 'మీనాక్షి'. అయితే సరోగసీని ఎంచుకోవడం నుంచి మీనాక్షి జన్మించడం వరకు సాగిన జర్నీని ఇన్‌స్టాలోని 'డాడ్స్ ఆఫ్ మీనాక్షి' పేజీలో పంచుకుంటూ పాపులారిటీ సంపాదించారు. ఇప్పటికీ ఆ చిన్నారి చేసే అల్లరి, ఆనంద క్షణాలను షేర్ చేస్తుంటారు. వీకెండ్ పిక్నిక్స్, పండుగ సమయంలో ఆలయ సందర్శనలు, గార్డెన్‌లో రకరకాల పూలతో మీనాక్షి ఆడుకునే రీల్సే మాత్రమే కాదు, తమ బిడ్డను ఎంతో అపురూపంగా, కంటికి రెప్పలా చూసుకుంటున్న వీడియోలు దర్శనమిస్తాయి.

'నేను మధురైకి చెందిన తమిళుడిని కాగా నా పార్టనర్ ఇటాలియన్. మా బంధం కారణంగా మా తల్లిదండ్రులకు బాధ కలిగించినా, మేం ఇద్దరం కలిసి ఉండేందుకు వారితో పోరాడి విజయం సాధించాం. ఇక మా జీవితంలోకి ఆహ్వానించిన చిన్నారికి మదురై మాతృ వంశ రాణి పేరు మీదుగా 'మీనాక్షి' పేరు పెట్టుకున్నాం. ఇక రెండో పేరుగా 'కార్బోని' అని పెట్టుకున్నాం. అయితే మీనాక్షి పుట్టిన తొలిరోజుల్లో ఆమెను చూసుకునేందుకు చాలా కష్టపడ్డాం. ఆమెకు ఫీడింగ్ ఇవ్వడంతో పాటు తరుచుగా డైపర్లు చేంజ్ చేయడం, ఏడుస్తుంటే ఎత్తుకుని తిరగడం, ఉయ్యాలలో ఆమెను ఆడించడం వంటి పనులతో బిజీగా మారిపోయాం. మా అమ్మానాన్నలు కూడా తగిన సూచనలు ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత ఇంటి పనులతో పాటు మీనాక్షి ఆలనాపాలన చూసుకునేందుకు వీలుగా మా టైమ్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాం. మీనాక్షి పెరిగేకొద్దీ ఆమె నన్ను అప్పా అని పిలుస్తుండగా, ఆండ్రియాను బబ్బో(ఇటాలియన్ భాషలో నాన్న) అని పిలుస్తుంది. ఆమెతో తమిళం సహా ఇటాలియన్ భాషలో కమ్యూనికేట్ అవుతాం. మన సంస్కృతి, సంప్రదాయాలు రెండింటినీ ఆదరిస్తూ మా కూతురు ఎదగాలని కోరుకుంటున్నాం

- విఘ్నేష్

అనేక దేశాలు స్వలింగ సంపర్కులు పిల్లలు కనే అవకాశం కల్పిస్తుండగా, మన దేశం కూడా IVF,సరోగసీ ద్వారా పిల్లలను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. కానీ జీవసంబంధమైన తండ్రి మాత్రమే పిల్లల పేరెంట్‌గా నమోదు చేయబడతారని చట్టం స్పష్టం చేస్తుంది. అయితే చట్టాలు, లింగబేధం, లింగ వివక్ష వంటి పదాలను పక్కనపెడితే.. ప్రేమ, కుటుంబం వంటి పదాలు భిన్న లింగానికి మాత్రమే సంబంధించిన పదాలు కాదు. అవి జీవకోటికి.. మానవులందరికీ చెందినవని గుర్తుంచుకోవడం ప్రధానం. ఫాదర్‌హుడ్, మదర్‌హుడ్ రెండు వేర్వేరు అర్థాలు కావచ్చు కానీ ఇద్దరు పురుషులకైనా, స్త్రీలకైనా.. పేరెంట్‌హుడ్ అనేది వారి పిల్లలతో ముడిపడిన అనుబంధాన్ని సూచిస్తుంది.

Advertisement

Next Story