కామన్వెల్త్ గేమ్స్ హాకీ షెడ్యూల్ ప్రకటన

by Harish |
కామన్వెల్త్ గేమ్స్ హాకీ షెడ్యూల్ ప్రకటన
X

న్యూఢిల్లీ : ఈ ఏడాది బర్మింగ్‌హోమ్ వేదికగా జూలైలో ప్రారంభమయ్యే కామన్వెల్త్ గేమ్స్‌లో మెన్స్, ఉమెన్స్ హాకీ టోర్నమెంట్ల షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) ధ్రువీకరించగా నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. కామన్వెల్త్ గేమ్స్ జూలై 28 నుంచి ఆగస్టు 8 మధ్య జరగనున్నాయి. మెన్స్, ఉమెన్స్ టోర్నమెంట్లలో పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. మెన్స్ టోర్నీలో పూల్ ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, స్కాట్లాండ్ ఉండగా.. పూల్ బిలో భారత్‌తోపాటు ఇంగ్లాండ్, కెనడా, వేల్స్, ఘనా జట్లను చేర్చారు. ఉమెన్స్ టోర్నీలో పూల్ ఏలో భారత్‌, ఇంగ్లాండ్, కెనడా, వేల్స్, ఘనా జట్లు ఉండగా..పూల్ బిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, స్కాట్లాండ్, కెన్యా జట్లు ఉన్నాయి. జూలై 29న డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్, కెన్యా మధ్య మ్యాచ్‌తో ఉమెన్స్ టోర్నమెంట్, ఇంగ్లాండ్, ఘనా మధ్య మ్యాచ్‌తో మెన్స్ టోర్నమెంట్ ప్రారంభకానున్నాయి. మొత్తం 54 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌‌‌కు చేరుకుంటాయి. ఆగస్టు 7న ఉమెన్స్ ఫైనల్, ఆగస్టు 8న మెన్స్ ఫైనల్ నిర్వహించనున్నారు.

తొలి మ్యాచ్‌లో మహిళలకు, పురుషులకు ఒకే ప్రత్యర్థి

ఈ టోర్నమెంట్లలో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఘనా పురుషుల, మహిళల హాకీ జట్లతో ఆడనున్నాయి. మెన్స్ టోర్నమెంట్‌లో భారత మహిళా హాకీ జట్టు షెడ్యూల్ జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. గ్రూపు దశలో తొలి మ్యాచ్ ఘనాతో తలపడనుండగా.. ఆ తర్వాత వేల్స్, ఇంగ్లాండ్‌, కెనడాతో ఆడనుంది. అలాగే, పురుషుల జట్టు జూలై 31న తన తొలి మ్యాచ్‌లో ఘనాను ఢీకొట్టనుంది. ఆ తర్వాత, ఆగస్టు 1వ తేదీన ఇంగ్లాండ్‌తో, 3వ తేదీన కెనడాతో, 4వ తేదీన వేల్స్‌తో ఆడనున్నది.

Advertisement

Next Story

Most Viewed