చట్టాన్ని కాపాడాల్సిన వాడే.. చెడు దారిలో నడిస్తే ఎలా..?

by Vinod kumar |
చట్టాన్ని కాపాడాల్సిన వాడే.. చెడు దారిలో నడిస్తే ఎలా..?
X

దిశ, వైరా: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని గంజాయి రహిత జిల్లాగా పేరు రావడం కోసం జిల్లా సీపీ విష్ణు వారియర్ గత కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. కానీ చివరకు పోలీసుల తనిఖీల్లో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంజాయి నూనెను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడడం చర్చనీయంగా మారింది.


పూర్తి వివరాల్లోకి వెళితే.. వైరా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏసీపీ స్నేహ మొహారా, సీఐ సురేష్, ఎస్ఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో వైరాలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా భద్రాచలం నుండి ఖమ్మం వైపు ద్విచక్ర వాహనంపై ఇద్దరు అనుమానితులను అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి తనిఖీ చేయగా రూ.2 లక్షల విలువైన గంజాయి నూనెని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు.


పట్టుబడ్డ వారిలో డోర్నకల్ కు చెందిన శతవత్ రాజ్ కుమార్ ప్రస్తుతం భద్రాచలంలోని టీఎస్ఎస్ పీ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారని అతనితోపాటు భద్రాచలం కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బడ్డీ దుర్గాప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అక్రమ మార్గంలో ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యవహరిస్తున్న తీరు పోలీసు వ్యవస్థకే మాయని మచ్చలా తయారవుతుంది. గతంలోనూ కొందరు పోలీసు శాఖలో పనిచేసిన అధికారులు గంజాయి రవాణాలో పట్టుబడిన సంగతి విధితమే. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని పెద్దలంటారు అందుకే కాబోలు.. తనను ఎవరూ ఆపరు ఏమీ చేయలేరని ధైర్యంతో ఏమో రాజ్ కుమార్ లాంటి కొందరు స్వార్థ పరుల వల్ల పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందని పలువురు పోలీసు శాఖ సిబ్బంది బహిరంగంగా చర్చించుకుంటున్నారు.


ఏది ఏమైనా.. చట్టం ఎవరికీ చుట్టం కాదు అని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తప్పు చేసిన వారు ఎవరైనా.. సరే ఉపేక్షించేది లేదని విధినిర్వహణలో నిష్పక్షపాతంగా వివరించిన వైరా సీఐ సురేష్, ఎస్ఐ వీరప్రసాద్, సిబ్బందిని ఏసీపీ స్నేహ మొహారా ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story