నిరుద్యోగులకు షాక్.. కోచింగ్​సెంటర్లలో ఫీజుల మోత

by Nagaya |   ( Updated:2022-03-26 01:15:45.0  )
నిరుద్యోగులకు షాక్.. కోచింగ్​సెంటర్లలో ఫీజుల మోత
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇప్పడొక లెక్క.. అన్నట్లుగా కోచింగ్​సెంటర్ల నిర్వాహకుల తీరు మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్​అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. తొలి విడుతలో భాగంగా 30 వేల పైచిలుకు పోస్టులు భర్తీకి గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్లకు గ్రీన్​సిగ్నల్​ఇవ్వడంతో కోచింగ్​సెంటర్లలో ఫీజుల మోత మోగుతోంది. ప్రతి ఇనిస్టిట్యూట్​లో కనీసం రూ.5 వేలు పెంచినట్లుగా తెలుస్తోంది. దీంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయి ఉంటే మళ్లీ ఈ భారమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్​కారణంగా ఇప్పటికే ఉపాధి కోల్పోయిన తల్లిదండ్రులు తమ పిల్లలకు కోచింగ్‌కు పంపుదామంటే ఆ భారంతో సతమతమవుతున్నారు.

తెలంగాణలో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్​వస్తుందా అని నిరుద్యోగులు వెయ్యి కండ్లతో ఎదురుచూశారు. తాజాగా 30 వేల పైచిలుకు పోస్టులకు నోటిఫికేషన్​వేయడంతో నిరుద్యోగులంతా తమ స్వగ్రామాల నుంచి నగరం బాట పట్టారు. అయితే గతంలో పోలీస్​ఉద్యోగానికి కోచింగ్‌కు గాను రూ. 15 వేలుంటే, ఇప్పుడు కోచింగ్​సెంటర్​ను బట్టి రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఉన్నట్లు సమాచారం. దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేలు పెంచడంతో యూనిఫాం పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్​ఇచ్చిన నోటిఫికేషన్‌లో 16 వేల పైచిలుకు పోస్టులు పోలీస్​డిపార్ట్​మెంట్​కు చెందినవే ఉండటంతో చాలామంది అభ్యర్థులు కోచింగ్​సెంటర్లకు తరలివస్తున్నారు. నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకున్న నిర్వాహకులు విద్యార్థుల నుంచి యథేచ్ఛగా డబ్బులు దండుకుంటున్నారు. అలాగే గ్రూప్ 1 పోస్టులకు గతంలో రూ.45 వేల పైచిలుకు ఉంటే ఇప్పుడు దాదాపు రూ.65 వేల నుంచి రూ.70 వేలకు చేరుకోవడం గమనార్హం.

ఇంటి నుంచి నగరం బాట పట్టిన యువత, నిరుద్యోగులు ఒకరితో ఒకరు పోటీ పడి చదివి ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుదామంటే పెరిగిన ఫీజులు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. గ్రేటర్​హైదరాబాద్​పరిధిలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, దిల్‌సుఖ్​నగర్, ఉప్పల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్ వంటి ప్రాంతాల్లో కోచింగ్​సెంటర్లు అన్ని కలుపుకుని దాదాపు 300కు పైచిలుకు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ సర్కార్​30 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి గ్రీన్​సిగ్నల్​ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పోటీ ఏర్పడే అవకాశాలున్నాయి. లక్షల్లో నిరుద్యోగులు, యువత దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. సీనియర్​ఫ్యాకల్టీ పేరుతో పాటు సులువుగా అర్థమయ్యే స్టడీ మెటీరియల్ కూడా అందిస్తామని చెప్పి నిర్వాహకులు అప్పనంగా అందినకాడికి దోచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం మరిన్ని నోటిఫికేషన్లు వేస్తే ఫీజులు మరింత పెరిగే అవకాశాలున్నాయని, అందుకే కష్టమైనా సరే ఫీజు ఇప్పుడే చెల్లించి ట్రైనింగ్​సెంటర్లలో చేరుతున్నారు.

ఫీజు తగ్గించాలి

కొవిడ్​కారణంగా ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయాం. లేక లేక తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసింది. కోచింగ్​సెంటర్​కు వెళ్తే వేలల్లో చెబుతున్నారు. ఎంత బతిమిలాడినా తగ్గించేదేలేదని చెబుతున్నారు. ఇష్టముంటే చేరండి, లేదా వెళ్లిపోండి అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఎలా ప్రిపేరయ్యేది.

- ప్రవీణ్, హైదరాబాద్

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

కోచింగ్​సెంటర్లలో ఇష్టారాజ్యంగా ఫీజు దోచుకుంటున్నారు. కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారి నిరుపేదల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. భారీ మొత్తంలో ఫీజులు పెంచడంతో పేద విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దోపిడీని అరికట్టాలి.

- రాకేష్, వరంగల్

Advertisement

Next Story