ఈ మ్యాట్రిమోనియ‌ల్ సైట్ అలాంటిదే.. జాగ్ర‌త్త‌?!

by Sumithra |   ( Updated:2022-05-04 11:16:33.0  )
ఈ మ్యాట్రిమోనియ‌ల్ సైట్ అలాంటిదే.. జాగ్ర‌త్త‌?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'మాన‌వ సంబంధాల‌న్నీ ఆర్థిక సంబంధాలే' అన్నాడు ఓ యుగ‌పురుషుడు. అయితే, ఆ మాట‌న్న‌ది ఇండియా గురించి మాత్రమే కాదు గ‌నుక అందులో కుల ప్ర‌స్తావ‌న చేయ‌లేదు. ప్ర‌త్యేకంగా ఇండియా గురించే అనాలంటే, 'భార‌త‌దేశంలో మ‌నుషుల సంబంధాలు కుల‌, మ‌త‌, ఆర్థిక సంబంధాలకు మించి ఏవీ కాదు' అనొచ్చేమో..?! ఎందుకంటే, కులాల్ని, వ‌ర్గ అంత‌రాల‌ను నిర్మూలించే దిశ‌గా వెళ్లాల్సిన స‌మాజం కొన్ని మ్యాట్రిమోనియ‌ల్ సైట్స్ వ‌ల్ల‌ తిరోగ‌మ‌నంలోకి నెట్ట‌బ‌డుతోంది. అవును, 'అస‌మాన భార‌తదేశం' సాధించ‌డానికి మ్యాట్రిమోని సైట్లు కూడా తెగ కృషిచేస్తున్నాయి. స‌మ‌స‌మాజం కోసం కుల‌, మ‌త‌, వ‌ర్గాంత‌ర వివాహాలు చాలా అవ‌స‌రమ‌ని జ్ఞానులు విజ్ఞాన బోధ చేస్తే, ఆ విజ్ఞానం నేర్పే చోటునే అస‌మాన‌త్వాన్ని పెంపొందించ‌డానికి వినియోగించుకుంటున్నారు కొంద‌రు వ్యాపారులు. ఇటీవ‌ల ప్ర‌జ‌లంద‌రి చేత ప‌చ్చి బూతులు తిట్టించుకుంటున్న 'ఐఐటిఐఐఎమ్‌షాదీ.కామ్ (www.iitiimshaadi.com)' సరిగ్గా ఇలాంటిదే.

బాలీవుడ్ స్టార్ డైర‌క్ట‌ర్ క‌ర‌ణ్‌జోహార్ అంబాసిడ‌ర్‌గా ఉన్న ఈ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఇటీవ‌లే ప్రారంభించారు. ఇప్ప‌టికే కులంపైరుతో, స్టేట‌స్ పేరుతో మ్యాట్రిమోనీ సైట్లు అంత‌రాల‌ను అమాంతంగా పెంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే, కొత్త‌గా ఓ స‌ప‌రేట్ క్లాస్‌ను తీసుకొచ్చే ప‌నిలో ఈ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ పూనుకుంది. ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు వాళ్ల‌ల్లో వాళ్లే పెళ్లిచేసుకుంటున్న‌ట్లు, ఐఐటి,ఐఐఎమ్మీయ‌న్లు కూడా ఆయా రిచ్ సంస్థ‌ల్లో చ‌దువుకున్న‌వారినే పెళ్లిచేసుకునే స‌దుపాయాన్ని క‌లుగ‌జేశారు. అందులోనూ ఈ వెబ్‌సైట్‌ను "ఎలిటిస్ట్" అని పిలుస్తూ స‌ప‌రేట్ స‌బ్‌క్లాస్ ట‌చ్ ఇచ్చారు. ఈ అగ్ర కళాశాల‌ల్లో చ‌దువుకున్న‌ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఈ వెబ్‌సైట్‌లో వారి పెళ్లి ప్రొఫైళ్ల‌ను రిజిస్ట‌ర్ చేయాలి. అస‌లు విష‌యం ఏంటంటే ఈ వెబ్‌సైట్ పెట్టినోడు ఐఐటి,ఐఐఎమ్మీయ‌న్ కాక‌పోవ‌డం విశేషం.

అయితే, ఈ వెబ్‌సైట్ ఇప్పుడు నెట్టింట్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కుంటుంది. వెబ్‌సైట్ కంటే ప్లాట్‌ఫారమ్ వ్యవస్థాపకుడు, సీఈఓ తక్ష్ గుప్తాను తెగ‌ ట్రోల్ చేస్తున్నారు. @verysanskarii అనే ట్విట్టర్ యూజర్ మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫారమ్ వెనుక ఉన్న వ్యక్తులను తెలుసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఈ స‌మాచార‌మంతా బ‌య‌ట‌ప‌డింది. ఈ సైట్‌లో ప‌నిచేసేవారెవ్వ‌రూ ఐఐటి, ఐఐఎమ్‌ల‌ల్లో చ‌దివిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు. ఇక, అగ్ర దర్శకుడు కరణ్ జోహార్ ఈ సైట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన‌ తర్వాత మ‌రిన్ని విమర్శలు వ‌చ్చాయి. వెబ్‌సైట్ పేరు ఇలా ఉన్నా ఆఫ‌ర్ విశాలంగానే ఉంది. దేశంలోని అగ్రశ్రేణి, గ్లోబల్ ఇన్‌స్టిట్యూషన్‌ల పూర్వ విద్యార్థులు కూడా ఈ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవ‌చ్చంట‌. 'ఏ గూటి పిట్ట ఆ గూటికే చేరుతుందనే' సామెతను ఇక్క‌డ అప్లై చేసుంటారు, కానీ స్వేచ్ఛ‌గా తిరిగే పిట్ట సామాజిక జీవి కాదు, సామాజిక జీవికి స‌మాన‌త్వం అవ‌స‌ర‌మ‌ని తెలుసుకోలేదేమో ఈ అగ్ర‌శ్రేణి విద్యావంతులు!!

Advertisement

Next Story