హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు!

by Harish |
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: రిజిస్ట్రేషన్ ఖర్చుల భారం కారణంగా హైదరాబాద్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ పరిసరాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే ఏకంగా 64 శాతం తగ్గిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్లు అయిన మెడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 25 శాతం క్షీణించి 5,146 యూనిట్లకు పడిపోయాయని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన రిజిస్ట్రేషన్ ఖర్చుల కారణంగా ఇళ్ల అమ్మకాలు నెమ్మదించాయని, ముఖ్యంగా బడ్జెట్ ధరలోని రూ. 25 లక్షల కంటే తక్కువ ఉండే ఇళ్ల విక్రయాలు ఎక్కువ ప్రభావితమయ్యాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఈ విభాగంలో అమ్మకాల రిజిస్ట్రేషన్లు గతేడాది ఇదే నెలలో 2,888 యూనిట్లుగా నమోదవగా, ఈ ఏడాది 844 యూనిట్లకు పడిపోయాయి.

ఇదే సమయంలో గతేడాది కంటే ఈసారి రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ ఖర్చులు 21 శాతం పెరిగింది. 'గత కొన్నేళ్లుగా అమ్మకాల ధరల్లో హైదరాబాద్ మార్కెట్ మెరుగైన వృద్ధి చూస్తోంది. కానీ ఈ ఏడాది ప్రారంభంలో ఒమిక్రాన్ ప్రభావం, ఆ తర్వాత ఆస్తి రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడం అమ్మకాలకు ప్రతికూలంగా మారింది. అయితే, ఇది తాత్కాలికంగానే ఉండొచ్చు. ఈ ఏడాది చివర్లోపు రిజిస్ట్రేషన్లు సాధారణ స్థితి చేరుకుంటాయని' నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు.

Advertisement

Next Story