బీటలు వారిన 'హరితహారం'.. సీఎం లక్ష్యం దిశగా పథకం పయనిస్తుందా..?

by Satheesh |
బీటలు వారిన హరితహారం.. సీఎం లక్ష్యం దిశగా పథకం పయనిస్తుందా..?
X

దిశ, ఖానాపూర్: మండల పరిషత్ కార్యాలయం వెనుక భాగాంలో 2017-18 హరితహారంలో భాగంగా వందలాది కానుగ మొక్కలు నాటారు. కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో నిర్వహణ గడువు తీరిందని ఇక నీరు పోయడమే మరిచారు. ఇక 2020లో దీని పక్కనే నాటిన పల్లె ప్రకృతి వనం పచ్చదనంతో వికసిస్తుండగా 2018లో పెట్టిన కానుగు మొక్కలు మాత్రం బీటలు వారిన నేల వైపు డీలాపడి చూస్తున్నాయి. మూడేండ్ల నిర్వహణ గడువు తీరిందని గ్రామ పంచాయతీ అధికారులు చెబుతున్నారు. నిర్వహణ గడువు తీరితే నీళ్లు పోయారా..! అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పక్కనే పల్లె ప్రకృతి వనానికి కావలసినన్ని నీరుండగా.. వీటికి పట్టడానికి మాత్రం కాసిన్ని నీరు కరువయ్యాయి. రెండేండ్లలో గ్రామ పార్కులోని మొక్కలు ఏపుగా పెరిగి వనంలా మారగా మూడేండ్ల నిర్వహణలో మొక్కలు మొక్క దశలోనే ఉన్నాయి.

ఒక్కొక్క మొక్కకి 5 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆవరణలో వందలాది మొక్కలు నాటించి నిర్వహణ కూలీ సైతం ఈజీఎస్ ద్వారా అందించింది. దీనికి తోడు నర్సరీ నిర్వహణ ఖర్చు అదనం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నిధులని వెచ్చిస్తూ హరితహారం అమలుపరుస్తున్నది. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకే ఆదరణ మధ్యలోనే ఆగిపోవడంతో అసలు లక్ష్యం వైపుగా పథకం పయనిస్తుందా.. అనేది అనుమానమే. దీనితో మూడేండ్ల నిర్వహణ వృథా అయినట్లేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కలుపు పెరిగి నీరు లేక ఎండకు మొక్కలు వాడిపోతున్నాయి. ఇకనైనా అధికారులు నిర్వహణ గడువు ముగిసిందని, ఆర్థిక వనరులు లేవని వదిలేయకుండా కనీసం ఈ వేసవి వరకైనా నీరు అందించి మొక్కల్ని బతికించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed