ఆశల పల్లకీలో నిరుద్యోగులు.. ఖాళీలలో సగం టీచర్ ఉద్యోగాలే

by Mahesh |
ఆశల పల్లకీలో నిరుద్యోగులు.. ఖాళీలలో సగం టీచర్ ఉద్యోగాలే
X

దిశ, నిర్మల్ కల్చరల్: శాసనసభలో ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగ ఖాళీల భర్తీ పై ప్రకటన చేయడంతో జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అధికార వర్గాలు వెల్లడించిన ఖాళీలలో నిర్మల్ జిల్లాలో 876 భర్తీ చేయాల్సిన పోస్టులు ఖాళీగా ఉండగా అందులో దాదాపు సగం ఉపాధ్యాయ పోస్టులు ఉండనున్నాయి. గత నాలుగు రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదట టెట్ నోటిఫికేషన్ రానున్నట్లు స్పష్టం చేయడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం నిర్మల్ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులలో పెద్ద మొత్తంలో ఖాళీలు ఉన్నట్లు గా స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రమోషన్లు ఇస్తే ఈ ఖాళీల సంఖ్యలో మరింత పెరుగుదల ఉండనుంది.

నిర్మల్ జిల్లాలో చివరిసారిగా జూనియర్ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో 2018 లో భర్తీ చేసింది. అంతకు ముందు టీఆర్టీ పరీక్ష ద్వారా 2017 లో ఉమ్మడి జిల్లా వారీగా ఉపాధ్యాయులను భర్తీ చేసింది. అప్పటినుండి ఇప్పటి వరకు 5 ఏళ్లుగా చెప్పుకోదగ్గ ప్రధానమైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవీ లేకపోవడంతో నిరుద్యోగుల్లో అనాసక్తి ఏర్పడింది. అనంతరం ఇటీవల స్వయంగా సీఎం కేసీఆరే అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో గత ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉన్న ఉద్యోగాల్లో సింహభాగం ఉపాధ్యాయులు, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలే ఉండడంతో జిల్లా అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది.

మొదట టెట్ నోటిఫికేషన్..!

అన్నింటికంటే ముందుగా టెట్ నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల ప్రకటించారు. నిర్మల్ జిల్లాలో దాదాపు 10 వేల పైచిలుకు మంది బీఎడ్, డీఎడ్ పూర్తి చేసి టెట్ నోటిఫికేషన్ కోసం వేచి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయపోస్టు అయిన ఎస్జీటీ‌కి ఈసారి డీఎడ్ చేసిన వారితో పాటు, బీఎడ్ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వనుండడంతో పోటీ తీవ్రస్థాయిలో ఉండనుంది. నిరుద్యోగులు ఇప్పటికే హైదరాబాద్, అవనిగడ్డ వంటి ప్రాంతాలకు శిక్షణ కోసం వెళ్ళడానికి సమాయత్తమవుతున్నారు.

పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు తీవ్ర పోటీ..

జిల్లాస్థాయి పోస్టుల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే పోస్టుల్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి శరీర దారుడ్య, రాతపరీక్షలు రెండూ కీలకం. ఈ పోస్టులకు కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. శరీర దారుడ్యం, పరుగు పోటీలకు సిద్ధమవుతున్నారు. కోచింగ్, సమగ్ర స్థాయిలో స్టడీ మెటీరియల్ సేకరణ పై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు.

జిల్లాస్థాయి ఉద్యోగ ఖాళీల వివరాలు..

పాఠశాల విద్యాశాఖ - 286

పోలీసు శాఖ - 265

రెవెన్యూ శాఖ - 99

సంక్షేమ శాఖలు -45

మున్సిపల్ శాఖ- 30

మహిళా, శిశు సంక్షేమ శాఖ-16

ఇతర శాఖలు - 135

పాఠశాల విద్యాశాఖలో ప్రమోషన్లు, బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ శాఖలో ఖాళీల సంఖ్య లో మరింత పెరుగుదల ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story