నవ వసంతం: షడ్రుచుల సమ్మేళనం ఉగాది

by Ravi |   ( Updated:2022-09-03 17:52:43.0  )
నవ వసంతం: షడ్రుచుల సమ్మేళనం ఉగాది
X

జీవితంలో కూడా మంచి చెడులు, కష్ట సుఖాలు అన్నీ కలగలసి షడ్రుచుల మాదిరిగా ఉంటాయి. నూతన సంవత్సరంలో సంభవించబోయే శుభాశుభాలను తెలుసుకోవడం కోసం పంచాంగ పఠనం శ్రద్ధతో వింటారు. ఉగాది పండుగను వివిధ ప్రాంతాలవారు వివిధ పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో 'గుడిపడవ 'అని పిలుస్తారు. మధ్యప్రదేశ్, బిహార్ ప్రజలకు కూడా ఉగాది పెద్ద పండుగ. జమ్మూ కాశ్మీరం, లడక్ లో ఉగాది పండుగను 'లోసర్' అని పిలుస్తారు. మనసా, వాచా, సధర్మాలతో ఉగాది ఉషోదయాన్ని ఆహ్వానిద్దాం.

ఆరు ఋతువులలో ఆది ఋతువు, అందమైన ఋతువు వసంతం. తెలుగు పంచాంగం ప్రకారం సంవత్సరాలు అరవై. కాలచక్రంలో భాగంగా మనం భావించే ఒక సంవత్సరం వసంతంతో ప్రారంభమై శిశిరంతో అంతమవుతుంది. వసంతం రాకతో ప్రకృతిలో ఒక పరిణామంతో కూడిన నవ్యత, విశిష్టత కనిపిస్తాయి. ఈ రోజు పండుగ అని ఎవరో చెప్తే విని పండుగ చేసుకోవడం కాకుండా ప్రత్యక్షంగా పండుగ వాతావరణాన్ని కళ్లతో వీక్షించి ప్రకృతి సాక్షిగా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మన తెలుగు వారికి 'ఉగాది' నూతన సంవత్సరాదే కాకుండ తొలి పండుగ కూడా. చంద్రుడు ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి చేసే సంచారాన్ని గుణించగా ఏర్పడినవే తెలుగు నెలలు. చైత్రం, వైశాఖం వంటి మాసాలు నక్షత్రాల పేరుతో వెలిసినవే. ఖగోళ గణిత శాస్త్రాన్ని అనుసరించి గుణించిన చైత్రమాస ఆరంభమే ఈ ఉగాది.

వేసవిలో చిగురులు

ప్రకృతి రీత్యా నేలలో తగినంత నీరు ఉన్నపుడే ఆ నేల నుంచి పుట్టిన మొక్క బలంగా పెరుగుతుందనేది జగమెరిగిన సత్యం. వేసవిలో చెట్లన్ని చక్కగా చిగురులు వేసి పచ్చని ఆకులతో ఉంటాయంటే కారణం. ఎంత వేడిమినైనా తన లోనికి రానీయక, తనలోని తేమను మొక్కలకు అందించేలా నేల ఓ విధమైన కొత్తదనాన్ని పొంది ఉండడమే. భయంకర ఉష్ణోగ్రతతో సూర్యుడు నీళ్ల మీద ప్రతాపం చూపిస్తుంటే నీటి పై భాగం మాత్రం వెచ్చబడి లోపల చల్లగా ఉండడానికి కారణం. నీటిలో ఓ కొత్తదనం ప్రవేశించడమే. అంతే కాదు, రుచిలోను ఓ కొత్తదనం చేరుతుంది. ఇక పగలంతా చెప్పలేనంత వేడిమి గల ఆ పగటి భాగం అలా కనుమరుగైపోయి కొద్దిగా చీకటి పడగానే మెల్లగా చలి ప్రారంభం కావడానికి గల కారణం వేడిమిలో కూడ ఓ కొత్తదనం ప్రవేశించడమే. వేసవి మొత్తంలో తీవ్ర వేడిని మనకు రుచి చూపించేది రోహిణి కార్తేలోనే. కాబట్టి రాబోయే వర్ష ఋతువు కోసం నీటిని పీల్చి మేఘరూపకంగా నిలువ చేయగల శక్తి ఈ కాలపు కిరణాలకే ఉంటుంది. ఈ తీరుగానే పగలంతా వేడిగాలితో చెవి గూబల్ని కాలిపోయేలా చేసే వాయువు కాస్తా సాయంత్రం అయ్యేసరికి చల్లని పిల్లగాలిలా మారిపోవడానికి కారణం వాయువులో కొత్తదనం ప్రవేశించడమే. ఎంతో నీటిని మేఘంగా నిలువ చేసి, ఎంతగాలి వీచినా వర్షించకుండా జాగ్రత్త చేస్తూ, ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికి పిడుగును సృష్టి చేసి భూమి మీద పడకుండా జాగ్రత్త వహిస్తూ, ఆకాశం మనలను రక్షిస్తుందంటే కారణం ఆకాశంలో కొత్తదనం ప్రవేశించడమే. సంవత్సరంలో ఉండే రెండు ఆయనాలలోనూ మొదటిది ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణంలో ఉండే మూడు ఋతువులలోనూ మొదటిది వసంత ఋతువు.

కష్టసుఖాల కలయిక

ఈ వసంత ఋతువులో ఉండే చైత్రం, వైశాఖం అనే రెండు మాసాలలో మొదటిది చైత్రం. చైత్రంలో ఉండే శుద్ధ, కృష్ణ పక్షాలలో మొదటిది శుద్ధ పక్షం. ఈ పక్షంలో పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉండే పదిహేను తిథులలోన మొదటిది పాడ్యమి. ఈ పాడ్యమిలోనూ ఉండే పగలు, రాత్రి అనే రెండిటిలోను మొదటిది పగలు. ఈ పగటిలోన ఉండే పదిహేను ముహూర్తాలలో మొదటిది బ్రహ్మి ముహూర్తం. ఈ విధంగా అన్నిటా మొదటిదనంతో ఉండే అంశాలే కాబట్టి ఇది అన్ని వేళలా కొత్తదనం కలిగిన ముహుర్తంగా భావించి నూతన సంవత్సరాదిగా, నూతన సంవత్సరంలో మొదటి పండుగగా నిర్వహించుకుంటున్నాము. ఏ రుచికి ఆ రుచిని తినేవాళ్లని చూడగలం తప్ప తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు గల రుచులన్నిటిని కలిపి ఒకటిగా చేసుకొని తినడం అనేది సంవత్సరాదినాడే కనిపిస్తుంది. ఇది కొత్తదనమే. కొత్తగా వచ్చిన చెరుకు గడ ముక్క (బెల్లాన్ని) తీపిని ,అప్పుడే తీసిన చింతపండు పులుపుతో కలిపి, కొత్తగా పండిన మిరియపు గింజను పొడి చేసి ఆ కారాన్ని జత చేసి, కొత్తగా కాసిన మామిడి ముక్క చిరువగరుని తగిలించి, అప్పుడే పంట పండిన సముద్రపు ఉప్పు రాతిని చేర్చి , కొత్తగా పూసిన వేప పువ్వు చేదుతో పచ్చడిని చేసి సంవత్సరాది రోజున కొత్త పచ్చడి తినడంలో ఎంతో కొత్తదనం ఉంటుంది. చెట్లన్నీ కొత్త కొత్త చిగుళ్లు ఆకులతో వనాల రూపంలో, రంగు రంగులతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంత గాలిలోనూ చెట్టు ఆకుల నీడన కూర్చుండి అలుపు సొలుపు లేకుండా కోయిల చక్కని గొంతుతో కొత్తగా కూయడం, సంవత్సరాది పిమ్మట దాదాపుగా వినపడకుండా పోవడం కూడా కొత్తదనమే.

అనేక పేర్లతో

కవి సమ్మేళనాలు నిర్వహించి కవులను సన్మానిస్తారు. ఇటువంటి కార్యక్రమం ఏ పర్వదినాలలోనూ కనిపించదు కాబట్టి ఇది కొత్తదనమే. ఉసిరి, తులసి తమలో కొత్త ఔషధి గుణాలను నింపుకొని ఈ కొత్తదనంలో మేము కూడ భాగస్వామ్యమని చాటుకుంటాయి. రహదారుల వెంబడి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా కొత్తదనంలో భాగమే. కాలానుగుణంగా తినడమూ, దానికి విరుగుడుకూడా అదే కాలంలో సృష్టించి మనకు ఇవ్వడమనేది ప్రకృతి మాత మనకు ప్రసాదించిన వరం. జీవితంలో కూడా మంచి చెడులు, కష్ట సుఖాలు అన్నీ కలగలసి షడ్రుచుల మాదిరిగా ఉంటాయి. నూతన సంవత్సరంలో సంభవించబోయే శుభాశుభాలను తెలుసుకోవడం కోసం పంచాంగ పఠనం శ్రద్ధతో వింటారు. ఉగాది పండుగను వివిధ ప్రాంతాలవారు వివిధ పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో 'గుడిపడవ 'అని పిలుస్తారు. మధ్యప్రదేశ్, బిహార్ ప్రజలకు కూడా ఉగాది పెద్ద పండుగ. జమ్మూ కాశ్మీరం, లడక్ లో ఉగాది పండుగను 'లోసర్' అని పిలుస్తారు. మనసా, వాచా, సధర్మాలతో ఉగాది ఉషోదయాన్ని ఆహ్వానిద్దాం.

నరేందర్ రాచమల్ల

99892 67462

Advertisement

Next Story