ధాన్యం సేకరణలో కుంభకోణం.. మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు: బండి సంజయ్

by Mahesh |
ధాన్యం సేకరణలో కుంభకోణం.. మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే భారీ కుంభకోణం దాగి ఉందని అర్థమవుతోందని, మిల్లర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్ముతున్నారనడానికి తమ వద్ద పూర్తి సమాచారం ఉన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పేర్కొన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన గురువారం లేఖ రాశారు. ప్రధాని మోడీకి సీఎం రాసిన లేఖలో అన్నీ అబద్దాలే ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్​గోయల్​ఇప్పటికే ఆధారాలతో సహా పూర్తి స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. 'వరి వేస్తే ఉరే గతి' అన్నది ముఖ్యమంత్రేనని, ఆపై యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని, ధాన్యం పండిస్తే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదనే విషయమన్నది సైతం రాష్ట్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు.

కేసీఆర్​ రైతులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ ​ధ్వజమెత్తారు. కేంద్రమే నేరుగా వడ్లు కొనాలంటూ.. కొత్త ప్రతిపాదన తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాల మూసివేత నిర్ణయం ఇప్పటిది కాదని, గతంలో నుంచే ముఖ్యమంత్రికి ఉందని విమర్శలు చేశారు. వరి ధాన్యం పండించే రాష్ట్రాలు చాలా ఉన్నాయని, మన పొరుగు రాష్ట్రం ఏపీలోనూ కేంద్రం తో ఏ గొడవా లేదని బండి సంజయ్ ​తెలిపారు. టీఆర్ఎస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్​చేశారు. ఇదిలా ఉండగా కరెంట్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీకి విరుద్ధంగా చార్జీల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేపట్టడాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బండి సంజయ్​పిలుపునిచ్చారు. విద్యుత్​చార్జీల పెంపును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story