- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
75 ఏళ్ల చరిత్రలో ఫస్టైమ్.. నేడు నల్లమలలో పర్యటించనున్న గవర్నర్ తమిళి సై
దిశ, అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతం ఉండగానే గత దశాబ్ధం క్రితం మావోయిస్టుల అలజడితో నల్లమలలో ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందోనని పాలకులు, ప్రభుత్వాలకు కంటినిండా కునుకు ఉండేది కాదు. ఏ మూలన ఏం జరుగుతుందోనని అటు పోలీసులు ఇటు నల్లమల ప్రజలు ఉలిక్కి పడేవారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆనాటి సీఎం స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మావోయిస్టులతో చర్చలు జరిపి నల్లమలలో మావోయిస్టుల అలజడి నల్లమల అటవీ ప్రాంతంలో లేకుండా చేసిన తదుపరి ఏర్పడిన పరిణామాలు అందరికీ తెలిసిందే.
నల్లమల లోతట్టు ప్రాంతంలో ఆదివాసీలు..
నల్లమల లోతట్టు ప్రాంతం కృష్ణా నది పరివాహక ఈ ప్రాంతమంతా కూడా నల్లమల పరిధిలోనే ఉన్నది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల, బల్మూరు, అమ్రాబాద్ మరియు పదరా మండలాలలో గల సుమారు 45 ఆదివాసీ గూడాలు నల్లమల లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. ఈ గూడాల్లో సుమారు 9 వేల మంది ఆదివాసీలు అడవి తల్లిని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగుతున్నారు.
పాలకులు, ప్రభుత్వాలు మారినా బ్రతుకులు అంతంతే..
గడిచిన 7 దశాబ్ధాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు, ప్రభుత్వాలు వారి స్థితిగతులు మారుతున్నాయి గానీ, నల్లమల లోతట్టు ప్రాంతంలో ఉన్న ఆదివాసుల స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని అందరికీ తెలిసిందే.
అటవీ హక్కుల చట్టాలకు తూట్లు..
మా బతుకులు మార్చేందుకు భారత రాజ్యాంగం కల్పించిన అటవీ హక్కుల చట్టాలకు సంబంధిత అటవీశాఖ అధికారులు తూట్లు పొడుస్తూ వాటిని తుంగలో తొక్కి అమ్రాబాద్ రిజల్ట్ టైగర్ పేరుతో ఆదివాసీల అభివృద్ధికి మరింత ఆమడ దూరంలో ఉండే విధంగా మోకాలడ్డుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్ ఏరియా పేరుతో అటవీశాఖ అధికారులు ఆదివాసీలకు ఉన్న భూములను సైతం లాక్కుంటూన్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే అటవీశాఖ అధికారులు అటవీ ఉత్పత్తులను సైతం సేకరించకుండా షరతులు పెట్టడంతో ఆదివాసీలకు ఉన్న కాస్త ఆర్థిక వనరులు లేక అవస్థలు పడుతూనే మరింతగా జీవన ఆర్థిక విధానం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మా బ్రతుకులు ఉన్నాయని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.
గుడిసెలు మారలే...
నల్లమల లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలు నూటికి ఎనభై శాతం మంది ఆదివాసీ గిరిజనులు బొడ్డు గుడిసెలోనే జీవనం కొనసాగిస్తున్నారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 1995 సంవత్సరంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సున్నిపెంట ఐ. జి. డి. ఎ. ఆధ్వర్యంలో ఆదివాసీలకు అప్పాపూర్ పెంట వద్ద ముప్పై పక్కా గృహాలు నిర్మించారు. తదుపరి కాలక్రమేణా నాణ్యతలో లోపాల కారణంగా వాన వస్తే లొడలొడా.. గాలి వస్తే గల గల అనే చందంగా నివాసాలు ఉండడంతో తిరిగి పూరి గుడిసెలను నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నారు. నేటికీ లోతట్టు ప్రాంతాలలో గల అన్ని చెంచు పెంటలో బొడ్డు గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం గవర్నర్ పర్యటన సందర్భంగా వాటిని మరమ్మతులు చేసి రంగులు అద్దారు. గత దశాబ్ధ కాలంగా ఆర్. డి. టి. సంస్థ వారు చెంచు గిరిజనులకోసం ప్రత్యేకంగా ప్యాకేజీ ఏర్పాటు చేసి ఏజెన్సీ, మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు పక్కా గృహాలు నిర్మిస్తున్న విషయం విధితమే. గత ఏడాది ఈ ప్రభుత్వం ఐ. టి. డి. ఎ మరియు ఆర్. డి. టి. స్వచ్ఛంద సంస్థ అనుసంధానంతో మరిన్ని పక్కా గృహాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతుంది. కానీ నల్లమల లోతట్టు ప్రాంతంలో ఆదివాసీ గూడాలలో అటవీ శాఖ అధికారులు పక్కా గృహాలు నిర్మించవద్దని, రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ యాక్టు ప్రకారం విరుద్ధమని తెలుపడంతో.. ఆదివాసీలకు ఏడు దశాబ్ధాల స్వతంత్ర చరిత్రలో పక్కా నివాసం ఉండకుండా ఆదివాసీ గిరిజన హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనరల్ గా మారిన ఉపాధి హామీ పథకంతో చెంచుల అవస్థలు..
నల్లమల ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులు మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజలతో సమానంగా పని చేయలేరనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ చెంచు గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ద్వారా విభాగం ఏర్పాటు చేసి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేవారు. ఈ విధానంతో ఆదివాసీలకు ఉపాధి హామీ పథకం పని దినాలకు నిమిత్తం లేకుండా ఆదివాసీలు ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులు పనులు కల్పించేవారు. అలాగే నూటికి 70 శాతం వారు పని చేస్తే 100% నిధులు విడుదల చేసేవారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కోసం నిధులు కేటాయిస్తే రాష్ట్రాలు అట్టి నిధులను ఇతర పనులకు కేటాయిస్తున్నారని, అలాగే నిధులు అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని నిర్ణయం తీసుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి చెంచుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం జనరల్ గా మారడంతో ఆదివాసీ గిరిజనులు మరింత ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందరితో సమానంగా కాకుండా గతంలో మాదిరిగానే చెంచుల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రత్యేక ప్యాకేజీని కేటాయించి పూర్వపు మాదిరిగా పనులు కల్పించి ఆదుకోవాలని నల్లమల్ల ఆదివాసులు కోరుతున్నారు. గవర్నర్ తమిళి సై పర్యటన సందర్భంగా జీవనోపాధిగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి అమలు చేసేలా కృషి చేయాలని ఆదివాసీలు ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చొరవతో..
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివాసీ గూడాలలో శాశ్వత సాగునీటి వసతిని కల్పించేందుకు సుమారు రూ. కోటి నిధులు కేటాయించారు. అందుకు సంబంధిత ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వం చెంచుపేటలో ఉన్న ఆదివాసీలకు శాశ్వత తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేకంగా నిధులు ద్వారా సోలార్ ద్వారా నీటి సరఫరా కార్యక్రమాలు పూర్తి చేసింది.
75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో మొదటిసారి..
నల్లమల లోతట్టు ప్రాంతంలో ఉన్న ఆదివాసీ చెంచు గిరిజనులతో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ పర్యటన ఈ నెల 26న ఖరారైన విషయం అందరికీ తెలిసిందే. గడిచిన 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో రాష్ట్ర గవర్నర్ హోదాలో నల్లమల లోతట్టు ప్రాంతంలోని అప్పాపూర్ ఆదివాసీ గ్రామపంచాయతీ రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో నల్లమల ప్రాంతంలో అటవీ ప్రాంతాలు నమ్ముకొని, అడవి తమ సర్వస్వం అని జీవిస్తున్న చెంచుల జీవన, ఆర్థిక, ఆరోగ్య మరియు వైద్య స్థితిగతులను స్వయంగా తెలుసుకోనున్నారు.
ఆరు నెలల క్రితం రెండు గూడాల దత్తత..
నల్లమల లోతట్టు ప్రాంతంలోని లింగాల మరియు అమ్రాబాద్ మండలాల పరిధిలో గల మల్లాపూర్ మరియు అప్పాపూర్ పెంచు గూడాలను గవర్నర్ తమిళిసై దత్తత తీసుకున్న విషయం విధితమే. తదుపరి జిల్లా రెడ్ క్రాస్ మరియు వైద్య అధికారుల చేత పై రెండు గూడాలలో పూర్తిస్థాయి ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికీ అందించాలని కృత నిశ్చయంతో సంబంధిత అధికారుల చేత న్యూట్రిషన్ మరియు వైద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
పర్యటనకు ఏర్పాట్లు పూర్తి..
నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేతృత్వంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. అలాగే పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.