Governor Tamilisai: కేసీఆర్ కు పోటీగా గవర్నర్.. భద్రాచలం పర్యటనకు తమిళి సై

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-16 06:47:36.0  )
Governor Tamilisai to visit Flood areas in Bhadrachalam On July 17
X

దిశ, తెలంగాణ బ్యూరో: Governor Tamilisai to visit Flood areas in Bhadrachalam On July 17| వారం రోజులుగా వర్షాలు, వరదలతో అతలాకుతలమైన భద్రాచలం ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సందర్శనలు పోటాపోటీగా జరగనున్నాయి. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేస్తుండగా.. గవర్నర్ మాత్రం సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వరకు రైల్లో వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇద్దరూ ఆదివారం రోజునే పర్యటిస్తుండడం విశేషం. తొలుత ఎవరి పర్యటన ఖరారైందనే అంశం ఎలా ఉన్నా.. ఒకే ప్రాంతంలో సీఎం ఆకాశమార్గంలో, గవర్నర్ క్షేత్రస్థాయిలో బాధిత ప్రాంతాలను సందర్శించడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు సీఎం ఏరియల్ సర్వే కొనసాగించనున్నారు. ముంపుకు గురైన ప్రాంతాలతో పాటు గోదావరి వరద ఉధృతి, కడెం మొదలు ఎస్సారెస్పీ, కాళేశ్వరం వరకు ప్రాజెక్టులను కూడా ఏరియల్ సర్వేలో భాగంగా పరిశీలించనున్నారు. పంట పొలాలు నీట మునగడం, నివాస ప్రాంతాలు ముంపుకు గురికావడం, భద్రాచలం పట్టణం వరదలో మునగడం తదితరాలన్నింటినీ పరిశీలించనున్నారు. వెంట ఉండే ప్రధాన కార్యదర్శి అక్కడ ప్రభుత్వపరంగా జరుగుతున్న సహాయక చర్యలను వివరించనున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ తరపున తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు చర్యలు మొదలుపెట్టారు.

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మాత్రం శనివారం రాత్రికే రైల్లో బయలుదేరి ఆదివారం ఉదయానికి భద్రాచలం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పలు ముంపు బాధిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులతో ముచ్చటించే అవకాశం ఉన్నది. ఆమె టూర్ షెడ్యూలుకు సంబంధించిన పూర్తి వివరాలను రాజ్‌భవన్ వర్గాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వర్షాలు పూర్తిగా ఆగిపోవడం, వరద ఉధృతి తగ్గడంతో భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. సుమారు రెండు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, కరకట్టను పొడిగించాలని డిమాంఢ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: భద్రాచలంలో సీఎం ఏరియల్ సర్వే

Advertisement

Next Story

Most Viewed