జూన్‌లో గణనీయంగా పెరిగిన ఇంధన అమ్మకాలు!

by S Gopi |
జూన్‌లో గణనీయంగా పెరిగిన ఇంధన అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, పంటల సీజన్ ప్రారంభమవడం, ప్రయాణాలు పెరగడం వంటి పరిణామాలతో ఈ ఏడాది జూన్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరిగాయని పరిశ్రమల ప్రాథమిక గణాంకాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా పంటల సీజన్ మొదలవడంతో డీజిల్ గిరాకీ గణనీయంగా పెరిగిందని, కరోనా మహమ్మారికి ముందు స్థాయిలో రెండంకెల వృద్ధి నమోదు చేసిందని, ఇది ఇటీవల ఎన్నడూ నమోదు కానీ రికార్డు అని గణాంకాలు తెలిపాయి. గణాంకాల వివరాల ప్రకారం, దేశంలో అత్యధికంగా వాడే డీజిల్ సమీక్షించిన నెలలో గతేడాది కంటే 35.2 శాతం పెరిగి 73.8 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇది 2019, జూన్ కంటే 10.5 శాతం ఎక్కువ, 2020, జూన్ కంటే 33.3 శాతం అధికం. వ్యవసాయ, రవాణా రంగాల నుంచి అధిక వినియోగం వల్లనే గిరాకీ భారీగా పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఇక, గతేడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది పెట్రోల్ అమ్మకాలు 28 లక్షల టన్నుల అమ్మకాలతో 29 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ఇది 2020, జూన్ కంటే 36.7 శాతం, 2019, జూన్ కంటే 16.5 శాతం ఎక్కువ. గతేడాదితో పోలిస్తే తక్కువ బేస్ ఎఫెక్ట్ ఈసారి పెరుగుదలకు కారణమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇటీవల వేసవి కాలం ముగియడంతో ప్రజలు ప్రయాణాలు ఎక్కువ చేస్తున్నారు. వంటగ్యాస్ అమ్మకాలు జూన్‌లో స్వల్పంగా 0.23 శాతం పెరిగి 22.6 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇది 2020 కంటే 9.6 శాతం, 2019, జూన్ కంటే 27.9 శాతం, ఎక్కువ. మరోవైపు రెండేళ్ల విరామం తర్వాత విమానయాన రంగం ప్రారంభం కావడంతో జెట్ ఇంధనం(ఏటీఎఫ్) అమ్మకాలు రెండింతలు పెరిగి 5.35 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇది 2020 జూన్ కంటే 150.1 శాతం, 2019 కంటే 12.9 శాతం ఎక్కువ అమ్మకాలు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed