మాజీ నక్సలైట్ సాంబశివుడి యాదిలో భువనగిరి

by GSrikanth |   ( Updated:2023-09-01 12:38:28.0  )
మాజీ నక్సలైట్ సాంబశివుడి యాదిలో భువనగిరి
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నేత సాంబశివుడిని ప్రముఖ గ్యాంగ్‌స్టర్ నయీం హతమార్చిన సంగతి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి వెళ్లి ఇన్నోవా వాహనంలో పదిమంది అనుచరులతో కలిసి తిరిగొస్తున్న సాంబశివుడిపై గోకారం గ్రామ స్టేజీ వద్ద రెండు కార్లలో వచ్చిన నయీం మనుషులు వేటకొడవళ్లు, గొడ్డళ్లతో పదేళ్ల క్రితం కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడిలో సాంబశివుడు అక్కడికక్కడే మరణించగా, అప్పటి వలిగొండ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం కొంతకాలం తర్వాత సాంబశివుడి తమ్ముడు, మాజీ నక్సలైట్ కోనపురి రాములును సైతం నయీం హతమార్చారు. ఈ హత్యతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉలిక్కపడింది.

మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న సాంబశివుడు, ఆయన తమ్ముడు రాములు హఠాత్తుగా పోలీసులకు లొంగిపోయి, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర సాధన కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో మరణించడంతో నాటి టీఆర్ఎస్ నేతలంతా సాంబశివుడి మరణాన్ని తట్టుకోలేకపోయారు. సాంబశివుడు, రాములు హత్యల అనంతరం టీఆర్ఎస్ సర్కార్ కూడా నయీంపై ప్రత్యేక దృష్టి సారించి, కొన్నేళ్ల తర్వాత పక్కా ప్రణాళికతో నయీంను ఎన్‌కౌంటర్ ద్వారా మట్టుబెట్టింది.

అయితే, ఇవాళ సాంబశివుడి 11వ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పార్టీలతో సంబంధం లేకుండా ఆయన్ను తలుచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన త్యాగాన్ని, పోరాటాన్ని గుర్తుచేసుకుంటున్నారు. వాట్సాప్ స్టేటస్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆయన గొప్పతనాన్ని చాటుతూ పోస్టులు పెడుతున్నారు. సాంబశివుడి పేరుమీద వచ్చిన విప్లవ గీతాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు.

Advertisement

Next Story