సీఎంపై మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి కీలక వ్యాఖ్యలు.. ఆ పాపం కేసీఆర్‌దే అంటూ..

by Satheesh |
సీఎంపై మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి కీలక వ్యాఖ్యలు.. ఆ పాపం కేసీఆర్‌దే అంటూ..
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: ధరణి పేరిట రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, ఇదంతా కేసీఆర్ పాపమేనని చేర్యాలమాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం చేర్యాలలో ఆయన మాట్లాడుతూ.. ధరణి పేరిట రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలు గట్టి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూములను ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో తిరిగి లాక్కున్నారని మండి పడ్డారు. వంద ఏళ్లుగా దున్నుకొని బతుకుతున్న పేదల ఈనాం భూములపై కేసీఆర్, ఆయన సామాజిక వర్గం కన్నుపడి ధరణిలో తిరిగి భూములను దొచుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామంలో ధరణి వల్ల అనేక మంది పోలీస్‌ల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగున్నారని అన్నారు. హైదరాబాద్ శివారులో తాజాగా జరిగిన రియల్టర్ల హత్యల పాపం ధరణి వల్లే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం నియోజకవర్గంలోనూ తప్పని ఇబ్బందులు..

సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌కు అతి దగ్గరలో ఉన్న గజ్వేల్ డివిజన్ మర్కూక్ మండలం దామరకుంట వాసులు ధరణితో కష్టాలు పడుతున్నారన్నారు. దామరకుంట గ్రామం సర్వే నెం.696లో 160.34 ఎకరాల విస్తీర్ణం కలదు, సుమారు 160 మంది రైతులు ఆధార్ నెంబర్ క్లియర్‌గా లేదని, ఖాస్రా పహణికి, ధరణి విస్తీర్ణానికి మధ్య తేడాల పేరుతో డిజిటల్ సంతకం చేయక, పట్టాదారు పాసుపుస్తకాలు అందక, రైతు బంధు, రైతు భీమా అందక మనో వేదనకు గురై తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వివిధ కారణాలతో పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయకుండా ఈ సర్వే నెం.696 మొత్తం విస్తీర్ణాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టారన్నారు. అదరాబాదరగా చేసిన భూ ప్రక్షాళన వల్ల నిరుపేద రైతులు భూమి ఉన్నా పాసు బుక్కు లేని నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత ఇలాకాలోని ఎర్రవల్లి ఫాం హౌస్ ప్రక్కన ఉన్న గ్రామ రైతుల పరిస్థితే ఇలా ఉంటే ఇంకా రాష్ట్రంలోని మిగతా గ్రామాల రైతుల పరిస్థితి ఏంటో..? రాష్ట్ర వ్యాప్తంగా ధరణి కష్టాలు అర్ధం చేసుకొవచ్చని అన్నారు.

5 లక్షల దరఖాస్తులు పెండింగ్..

ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం ఒక సర్వే నంబర్‌లో కొంత భూమిని సేకరిస్తే.. మొత్తం సర్వే నంబర్‌నే ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చిందని, అలాగే పట్టా భూములను కూడా ప్రభుత్వ భూములుగా, రెవెన్యూ ల్యాండ్స్‌ను ఫారెస్ట్, ఎండోమెంట్, వక్ఫ్ ల్యాండ్స్‌గా మార్చడంతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు. మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్లకు ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా ఇదే జాబితాలో ఉన్నాయన్నారు. పోడు భూములకు హక్కుల కోసం గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని పోయిన ఏడాది నవంబర్‌లో రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసిందని, దీనికి లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి జిల్లాల్లో పోడు భూములకు హక్కులు కోరుతూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, దాదాపు రెండున్నర లక్షల మంది, ఐదు లక్షల ఎకరాలకు అప్లికేషన్ పెట్టుకున్నా గిరిజనులకు ఆ భూములకు పట్టాలు ఇచ్చేందుకు అనుసరించాల్సిన గైడ్ లైన్స్‌ను ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదని విమర్శించారు.

తక్షణమే రెవెన్యూ పరిపాలనలో కీలకమైన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాలని, భూ పరిపాలన ప్రధాన కమీషనర్‌ను నియమించి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, భూ సమస్యలు పరిష్కరించే తీరుపై కింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ధరణిలో డేటా ఎంట్రీ లోపం వలన ఏర్పడిన తప్పులు, భూ స్వభావం తప్పులు, విస్తీర్ణంలో తేడాలు సరిచేయుటకు రైతులు ఎదుర్కొంటున్న మేజర్ సమస్య అయిన ప్రతి సర్వే నెంబర్ ను మరోసారి సేత్వార్, ఖాస్రా, చెస్సాల పహణీలో నమోదు ఉన్న పూర్తి విస్తీర్ణానికి మరియు ధరణిలో ప్రతి సర్వే నెంబర్‌లో నమోదు అయిన పూర్తి విస్తీర్ణంతో సరిపోల్చి తేడాలుంటే సరిచేయుటకు, భూ వివాదాలు రాకుండా గతంలో అమ్మిన తరువాత కూడా ధరణిలో ఉన్న పట్టాదారు వివరాలపై పూర్తి స్థాయిలో ప్రాథమిక విచారణ జరుపుటకు ప్రత్యేక కమిటి ఏర్పాటు చేయ్యలన్నారు. డిజిటల్ సర్వే చేసి ప్రతి సర్వే నెంబర్‌కు డిజిటల్ మ్యాపులు తయారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed