అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఆ ఇండ్లు..!

by Javid Pasha |
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఆ ఇండ్లు..!
X

దిశ, దుమ్ముగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. ఇల్లు లేని పేదల సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందో అని కళ్ళలో వఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో రెండు పడకల ఇల్లు పూర్తి కాగా వాటిని లబ్దిదారులకు కేటాయించారు. మిగతా గ్రామాల్లో మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో స్లాబ్ లెవల్‌లో ఉండగా.. కొన్ని మొత్తానికే పనులు ప్రారంభించక పోవడం గమనార్హం. పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు కేటాయించక పోవడంతో అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి.

దుమ్ముగూడెం మండలంలోని 8 గ్రామాల్లో మొత్తం 380 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో కొన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. గంగోలు గ్రామంలో 90, మహాదేవపురం 40 గత రెండు సంవత్సరాల క్రితం ఇళ్లను పూర్తి చేసి గతంలోనే లబ్ధిదారులకు అందజేశారు. తూరుబాక 25, దుమ్ముగూడెం 25, చిన్న నల్లబల్లి 25, ప్రగల్ల పల్లి 25, పెద్ద నల్లబెల్లి 25, గౌరవరం 25, మారాయిగూడెం 25.. ఈ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. కొన్ని ప్రారంభ దశలో ఉండగా, మరికొన్ని ఇళ్లు పూర్తై కూడా లబ్ధిదారులకు కేటాయించలేదు. సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని 20 ఇళ్లు మంజూరు అయ్యాయి. కానీ అక్కడ విద్యుత్ సౌకర్యం లేక నిర్మాణ పనులు ప్రారంభించలేదు.


అదే విధంగా రామారావు పేట 30 మంజూరు కాగా.. తాలిపేరు కాలువ భూ సమస్యలు ఉండటం వలన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మండలంలో డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు కొన్ని స్లాబ్ వరకు రాగా, మిగతా ఇళ్ల నిర్మాణం ప్రారంభమే కాలేదు. అదే విధంగా మండలంలో ఇళ్లు మంజూరైనా ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి సమయాల్లో మందుబాబులు అందులోనే మద్యం సేవించడంతో ఎక్కడ చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి.

ఆ ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. భవనాలు ప్రారంభించక ముందే డబుల్ ఇళ్లకు పగుళ్లు ఏర్పడి, లీకిణీలతో గోడలు పాకురు పట్టాయి. పనులు సైతం నాణ్యత ప్రమాణాలు పాటించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి..వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. మండలంలోని గంగోలు గ్రామ పంచాయతీలో గత రెండేళ్ల క్రితం దాదాపు 90 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు.

ఈ ఇళ్లను రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఇళ్ల నిర్మాణం పక్కన పంట పొలాలకు సాగునీరు వెళ్ళే కాలువ ఉంది. గంగోలు గ్రామ పంచాయతీ పంట సాగుకు ఈ కాలువ నీరే ఆధారం. కానీ వర్షా కాలంలో గోదావరి వరదల కారణంగా ఈ పిల్ల కాలువ పొంగి వరద నీరు డబుల్ బెడ్రూం ఇండ్లను ముంచేస్తున్నాయి. ఈ విషయమై లబ్దిదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వారు స్పందించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story