పోటీకి సిద్ధమైన ఆ ఏడుగురు వారసులు

by Nagaya |
పోటీకి సిద్ధమైన ఆ ఏడుగురు వారసులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సీనియర్ నేతల వారసులు రెడీ అవుతున్నారు. దాదాపుగా ఏడు మంది తమ అదృష్టాలను పరీక్షించుకోవడానికి తమ తండ్రుల ద్వారా పావులు కదుపుతున్నారు. తండ్రులు సైతం వయోభారం.. తదితరాల కారణాల వల్ల తమ వారసులను రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు ఉన్న అన్ని రకాల వనరులను సద్వినియోగపరచుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయా పార్టీలలో కొనసాగుతున్న సీనియర్ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ వారసులకు అవకాశాలు కల్పించేందుకు, అవసరం అయితే పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు మంది రాజకీయ వారసులు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ అదృష్టాలను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి అవకాశాలు కల్పిస్తాయా.. లేక సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తాయే వేచి చూడాలి.


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీనియర్ రాజకీయ నాయకులు తమ వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ కదనరంగంలో వారసులను దించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గద్వాల నియోజకవర్గం నుంచి వీలును బట్టితన కూతురు స్నిగ్దా రెడ్డిని పోటీ చేయించేందుకు డీకే అరుణ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరిగే పలు కార్యక్రమాలతో పాటు జిల్లా పార్టీ కార్యక్రమాలలోనూ స్నిగ్ధారెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గం పై దృష్టిని సారించిన విషయం పాఠకులకు విదితమే.. అక్కడ సాధ్యం కాకుంటే పాలమూరులో అయిన పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. జడ్చర్ల, షాద్ నగర్, మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంపీ, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడు జీవన్ రెడ్డి ఆసక్తి కనబరుస్తున్నారు.

అచ్చంపేటపై భరత్, నాగర్ కర్నూల్‌పై రాజేష్ రెడ్డి గురి

అచ్చంపేట రిజర్వు స్థానం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు కల్వకుర్తి జడ్పీటీసీ, ఎంపీ రాములు తనయుడు భరత్ ప్రసాద్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యావంతుడైన భరత్ ప్రసాద్ జిల్లా పరిషత్ ఎన్నికలలో కల్వకుర్తి మండలం నుంచి జడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని భావించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం జడ్పీ చైర్మన్ అయ్యేది భరత్ ప్రసాద్ అని భావించారు. కానీ స్థానికంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఆశిస్తున్నట్లు సమాచారం. తండ్రి దామోదర్ రెడ్డి సైతం తన తనయుడికి రాజకీయ భవిష్యత్తును ఇవ్వాలని ధృఢ నిశ్చయంతో ఉన్నట్లు ప్రచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలని ఆశించినా.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి మరోసారి అవకాశం ఉంటుందని ఇటీవల ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజేష్ రెడ్డి మిన్నకుండిపోతారా లేక ఇతర పార్టీలలో నుంచైనా పోటీ చేస్తారా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

అలంపూర్‌లో మంద, అబ్రహం తనయుల యత్నాలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అలంపూర్ నియోజకవర్గ నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం తనయుడు అజయ్ ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు, తనకంటూ ఓ కేడర్ ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాడు. మరోవైపు ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం తనయుడు మంద శ్రీనాథ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయకుండా రాములుకు అవకాశం కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకోవడం, 2014లో తనయుడు శ్రీనాథ్ అలంపూర్ నియోజకవర్గ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తాను ఓడినా పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన భూమిక పోషించాడు. ఈ క్రమంలో ఈసారి అలంపూర్ నియోజకవర్గం నుంచి శ్రీనాథ్ కు అవకాశం ఇప్పించేందుకు జగన్నాథం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అవకాశాలు ఎవరికి లభిస్తాయో..?

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏకంగా ఏడు మంది రాజకీయ వారసులు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ అదృష్టాలను పరీక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి అవకాశాలు కల్పిస్తాయా.. లేక సీనియర్లకే ప్రాధాన్యతను ఇస్తారా అన్న అంశాలపై చర్చలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాలని కొంతమంది భావిస్తుండగా మరికొందరు తాము ఉన్న పార్టీలలో అవకాశం లభించకుంటే పార్టీ మారైనా సరే తనయులను పోటీలో నిలబెట్టాలని మరి కొంతమంది భావిస్తున్నట్లు సమాచారం. మరి వచ్చే ఎన్నికలలో పదవులు ఎవరి తలుపులను తట్టుతాయో వేచి చూడాలి.

Advertisement

Next Story