తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ నేత కన్నుమూత

by Disha News Desk |
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ నేత కన్నుమూత
X

దిశ, అందోల్: తెలంగాణ ఉద్యమకారుడు, తొలి, మలిదశ ఉద్యమ నేత పులుగు కిష్టయ్య (74)గురువారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. అందోలు నియోజకవర్గం నుంచి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఇక్కడ ప్రజలను ఉద్యమం వైపు మళ్లించడంలో కీలకపాత్ర పోషించాడు. 1969లో జరిగిన ఉద్యమ సమయంలో జైలు జీవితాన్ని కూడా గడిపారు. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన తర్వాత 2006వ సంవత్సరంలో కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

అప్పటి నుంచి 2014 వరకు అందోలు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంఛార్జీగా ఉండి స్థానికంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి టీఎన్జీవో నాయకుడిగా జిల్లా స్థాయిలో ఒక వెలుగు వెలిగారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ లక్షణాలను అలవర్చుకున్న ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మలిదశ ఉద్యమ సమయంలో కిష్టయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

నేడు జోగిపేట లో అంత్యక్రియలు

తెలంగాణ ఉద్యమ కారుడు పులుగు కిష్టయ్య అంత్యక్రియలు శుక్రవారం జోగిపేట లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని వారు సూచించారు. అంత్యక్రియలకు మంత్రి హరీష్‌రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కాంగ్రేస్, బీజేపీ నాయకులు, టీఎన్జీవో నాయకులు పాల్గొననున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే కావాలన్న కల నెరవేరకుండానే

అందోలు రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న కోరిక నెరవేరకుండానే కిష్టయ్య తుది శ్వాస విడిచారు. 1989లో జరిగిన శాసనసభ సాధారణ ఎన్నికల్లో కాంగ్రేస్‌పార్టీ తరపున టికెట్టు దాదాపు ఖాయమవుతున్న సమయంలో మాజీ మంత్రి రాజనర్సింహా కుమారుడైన దామోదర్‌ కూడా ఆశించడంతో పార్టీ అధిష్టానవర్గం దామోదర్‌ వైపు మొగ్గు చూపడంతో కిష్టయ్య ఆశలు ఆడియాశలయ్యాయి. ఆ ఎన్నికల్లో దామోదర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్, టీడీపీ పార్టీలతో ఏర్పడిన మహాకూటమిలో కూడా టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్టు కోసం ప్రయత్నించగా, కేసీఆర్, కిష్టయ్యను హైద్రాబాద్‌కు పిలిపించుకొని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి అవకాశం కల్పిస్తానని నచ్చజెప్పి, అప్పట్లో పార్టీ తరపున బాబూమోహన్‌కు టికెట్టు కెటాయించారు. అప్పట్లో బాబూమోహన్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పలువురు నాయకుల సంతాపం..

ఉద్యమ నాయకుడు పి.కిష్టయ్య మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కి రణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్, మాజీ ఎమ్మెల్సీ సత్యానారాయణ, బ్రూవరీస్‌ చైర్మన్‌ దేవీ ప్రసాద్, మాజీ మంత్రి పి.బాబూమోహన్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి తో పాటు ఆయా పార్టీల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Advertisement

Next Story