- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకప్ .. సో వాట్? మందు కాదు మానసిక వైద్యుడే మోస్ట్ ఇంపార్టెంట్
దిశ, ఫీచర్స్ : 'జీవితాంతం' కలిసుందామని చేతిలో చెయ్యేసి ప్రతిజ్ఞ చేసుకున్న ఎన్నో జంటలు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక బంధానికి ముగింపు పలుకుతున్నాయి. కలిసున్న కాలం నాలుగు నెలలా? నాలుగేళ్లా? అన్నది ముఖ్యం కాదు కానీ ఫస్ట్ బ్రేకప్ మనసును ఎంత చిత్రవధ చేస్తుందనేది మాటల్లో చెప్పలేం. బంధానికి బై బై చెప్పినా, ఆ తాలుకా జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. విచారం, కోపం, భయం, పశ్చాత్తాపం, ఒంటరితనం, చిరాకు, నిస్తేజం, నిరాశ వంటి మిశ్రమ భావోద్వేగాల నుంచి తప్పించుకోవడం అంత సులభం కాకపోవచ్చు. కానీ జరిగిందే తలుచుకుని జీవితాన్ని గతానికే పరిమితం చేయకుండా.. ముందుకు వెళ్లడం ప్రధానమంటున్నారు మనస్తత్వ నిపుణులు. అంతేకాదు ఆ బాధను ఓవర్‌కమ్ చేసే టిప్స్ కూడా అందిస్తున్నారు.
చాలా మంది తమ 'లవ్ లైఫ్'లో పార్ట్‌నర్ ప్రజెన్స్‌లో ఈ ప్రపంచాన్నే మరిచిపోయి మైమరిచిపోతుంటారు. దీంతో ఆ బంధం ఒక్కసారిగా ముక్కలయ్యేసరికి ఒంటరితనం ఆవహించి.. గజిబిజి రోడ్ల మధ్యలో దిక్కుతోచని పసిపాపల్లా అల్లాడిపోతుంటారు. కానీ కాస్త కుదుటపడి సావదానంగా ఆలోచిస్తే కమ్ముకున్న కారుమబ్బులన్నీ తొలిగిపోతాయి. ఒక్కసారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనసారా చూడండి. పెద్దగా ఏ మార్పు కనిపించదు. ఇదీ అంతే.. ఈ కష్ట సమయాన్ని 'సెల్ఫ్ ఎక్స్‌ప్లోర్'కు అవకాశంగా భావించండి. ఎప్పటినుంచో ప్రయత్నించాలనుకున్న పనులన్నీ చకచకా చేసేయండి. గతంలో వెళ్లలేని వెకేషన్ ట్రిప్స్, ఫుడ్ ప్లేసెస్, కలవని మిత్రులు, ఇగ్నోర్ చేసిన బంధువులను కలిసి కొత్త బంధాలు, సరికొత్త అనుభూతులు, అనుభవాలు పొందండి. గత జ్ఞాపకాలు తొలిచేస్తే అవాయిడ్ చేసేందుకు ఇష్టమైన పనిపై దృష్టి పెట్టండి. కొత్తగా ఏదైనా ట్రై చేస్తూ బిజీ బిజీగా గడిపేయండి.
సామాజికంగా చురుకుగా ఉండండి..
ఒకరితో విడిపోయిన తర్వాత కొంత కాలం నిరాశకు గురవుతారనడంలో సందేహం లేదు. కానీ మిమ్మల్ని మీరు మళ్లీ నిర్మించుకోవడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని తిరిగి పెంచుకునేందు ప్రయత్నించాలి. ఈ మేరకు బ్రేకప్ తర్వాత ఒంటరిగా కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. బ్రేకప్ ముందుకు సాగడానికి ఇబ్బంది పెడుతుంటే లేదా ఏ విధంగానైనా అసురక్షితంగా భావిస్తే.. మీరు విశ్వసించే వారితో ముఖ్యంగా మిమ్మల్ని ఇష్టపడే, మీకు మద్దతిచ్చే వ్యక్తులతో కలిసి ఉండాలి. ఈ సున్నితమైన సమయంలో వారితో మనసు విప్పి మాట్లాడటం వల్ల భిన్నమైన దృక్పథాన్ని పొందవచ్చు. మరీ ముఖ్యంగా మన పరిస్థితి ఇతరులకు ఎలా కనిపిస్తుందోనని ఆందోళన మంచిది కాదు. సామాజికంగా అందరితో కలిసి ఉండడం వల్ల బ్రేకప్ బాధ నుంచి ఉపశమనం పొందడమే కాదు సామాజికంగా, శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం పెంపొంది నొప్పి, నిరాశ తగ్గించడంలో సాయపడుతుంది.
మీ ఆలోచనలు పేపర్ మీద పెట్టండి..
మనసు బరువుగా ఉంటే, భావోద్వేగాలు పదేపదే చుట్టుముడుతుంటే ఆ భారాన్ని తగ్గించుకునేందుకు, ఆ భావాల నుంచి బయట పడేందుకు 'నోట్‌బుక్'లో రాయడం ఉత్తమమని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. మనసులోని ఆలోచనలను కాగితంపై రాయడం ద్వారా మానసిక స్వస్థత చేకూరి, మళ్లీ ట్రాక్‌లోకి వస్తారని సూచిస్తున్నారు. రాసుకున్న వాటిని కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే, మనం ఎదుర్కొన్న సమస్య ఇంత చిన్నదా? అనే భావన కలుగుతుందని పేర్కొన్నారు. ఇక సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, సినిమా చూడటం, ధ్యానం చేయడం, గేమ్స్ ఆడటం వల్ల కూడా బాధ నుంచి విముక్తి పొందవచ్చని అంటున్నారు. ఈ మేరకు సాహిత్యం మనిషి ఆలోచనా పరిధిని, విషయ పరిజ్ఞాన ఘాడతను పెంచుతుందని, అందువల్ల ఆలోచనల్లోనూ మార్పు వస్తుందని తెలిపారు.
జీవితం ఆగిపోదు..
బ్రేకప్ అంటే ఓడిపోవడమో, ఎప్పటికీ ఒంటరిగా మిగిలి పోవడం కాదు. మీలో ఏదైనా తప్పు ఉందనే అర్థం అస్సలు కాదు. ఒకరి జీవితంలో బరువుగా ఉండటం కంటే ఆ బంధం నుంచి తప్పుకోవడమే మంచిదని గుర్తుంచుకోండి. విడిపోవడంలో సానుకూల అంశాలను చూడటానికి ప్రయత్నిస్తే, భవిష్యత్ సంబంధాలలో మీరు ఏమి కోరుకుంటున్నారో మరింత తెలుసుకోవచ్చు. అలాగే విడిపోవడానికి కారణం ఏదైనా సరే లైఫ్ అక్కడితోనే ముగిసిపోదని, కల్లోలం ఉన్నా, కలతలో ఉన్నా.. జీవితం ఒకరి కోసం ఆగదని గ్రహించాలి. జీవనదిలా నిరంతరం సాగే జీవన ప్రవాహంలో కొట్టుకుపోవాలా? హాయిగా జీవించాలా? అన్నది మన నిర్ణయం. ఒక్కటి మాత్రం నిజం చిరునవ్వుతో స్వాగతిస్తే.. జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తూనే ఉంటారు. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే మీతో ఉండేందుకే ఇష్టపడతారు.
మత్తులో మునగడం కరెక్ట్ కాదు..
చాలామంది నొప్పిని ఎదుర్కోవటానికి మద్యం, ఇతర మందులను స్వీకరిస్తారు. అవి మీకు మొదట్లో మంచి అనుభూతిని కలిగించడంలో సాయపడినప్పటికీ, ఆ తర్వాత ప్రభావాలు మిమ్మల్ని మరింత అధ్వాన్నంగా మారుస్తాయి. అందువల్ల వాటి జోలికి పోకుండా ఉండటమే ఉత్తమం. ఎంత ప్రయత్నించినా బ్రేకప్ బాధను మరిచిపోలేకపోతే.. మానసిక వైద్యుడిని కలిస్తే మంచిది. భావోద్వేగాలను అధిగమించేందుకు సరైన మార్గాలను కనుగొనడంలో మీకు సహాయపడతారు. సంబంధాల పునరుద్ధరణలో తగిన సూచనలు అందిస్తారు.