Komati Reddy Venkat Reddy: నన్ను పంపించేయాలని చూస్తున్నారు..

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-12 11:06:39.0  )
Congress MP Komati Reddy Venkat Reddy Comments On TPCC Chief Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: Congress MP Komati Reddy Venkat Reddy Comments On TPCC Chief Revanth Reddy| తనను పార్టీ నుండి పంపించి వేసి కాంగ్రెస్ ను ఖాళీ చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. చండూరు సభలో తనను అసభ్యంగా తిట్టించారని ఈ విషయంలో రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడు కసరత్తుపై పార్టీ నుండి తనకు ఎలాంటి సమాచారం అందడం లేదని, తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలోనే తేల్చుకుంటానని అన్నారు. మునుగోడు ప్రచారానికి తాను వెళ్లనని అన్నారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన మాణిక్కం ఠాగూర్ తన ఇంటికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన వెంకట్ రెడ్డి.. కొంత మంది పెద్దలు కావాలనే అతడి చేత తిట్టించారని ఆరోపించారు.

పార్టీ కోసం పని చేసిన తనను కనీసం వయసు రీత్యా గౌరవించకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషించారని ఈ మాటలు అన్ననాటి నుండి తనకు నిద్ర లేదని అన్నారు. తనను హోంగార్డుతో పోల్చారని రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఆ ఐఏఎస్, ఐపీఎస్ లే గెలిపిస్తారని ఎద్దేవా చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన తనను హోం గార్డుతో పోల్చారు.. పార్టీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబుతో పాటు పార్టీలో ఉన్న సీనియర్లు అందరు హోంగార్డులేనా? అని ప్రశ్నించారు. ఓ వైపు తన తమ్ముడి రూపంలో మానవ సంబంధం మరో వైపు పార్టీ.. ఇలా తాను సంకట స్థితిలో ఉండగా తనను మరింత మానసికంగా క్షోభకు గురయ్యేలా చేస్తున్నారని అన్నారు.

తాను మిగతా వారిలా నాలుగైదు పార్టీలు మారలేదని, ఇకపై కూడా పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. మునుగోడులో యుద్దం చేయకముందే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చిన నాలుగు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఇప్పుడు ఓడిపోయినా ఏమీ కాదని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని విమర్శించారు. ఉప ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని చెప్పాల్సిన టీపీసీసీ ప్రెసిడెంట్.. గత ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ వెంట్రుక కూడా పోలేదని చెప్పడం సబబేనా? అని ప్రశ్నించారు. బాధ్యతయుతమైన వ్యక్తి ఎన్నికలకు ముందు ఇలాంటి మాటలు అనాల్సినవేనా? అని ప్రశ్నించారు.

నాలుగైదు సార్లు ఓటమిపాలైన షబ్బీర్ అలీ వంటి నాయకులను వెంట పెట్టుకుని తనలాంటి వారిపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు మారి వచ్చిన వారికి కాంగ్రెస్ పై ప్రేమ ఉండదని, అందువల్లే ఓడిపోయినా పర్వాలేదనే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ లో దళిత బంధు అన్ని కుటుంబాలకు ఇచ్చిట్లుగానే మునుగోడులోనూ దళిత కుటుంబాలన్నింటికి వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీలతో పాటు బీసీ, ఎస్టీలకు సైతం ఇంటికి పది లక్షల ఆర్థిక సాయం చేయాలని అన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. మునుగోడు ప్రచారానికి వెళ్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ తనను ఇప్పటి వరకు ఎవరూ ఆహ్వానించలేదని అన్నారు. తనను చండూరు సభలో తిట్టించిన పెద్దలు క్షమాపణలు చెప్పాలని, అలాగే బ్రాందీ షాప్, హోం గార్డు పదాలను ఉపసంహరించుకుని తనను ఆహ్వనిస్తే ఆలోచిస్తానన్నారు. అంతే కానీ పిలవని పేరాంటానికి తాను వెళ్లేవాడిని కాదని స్పష్టం చేశారు. తాను ఉద్యమకారుడినని, రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

మునుగోడు ఉపఎన్నికపై కార్టూన్

భట్టి విక్రమార్క పాదయాత్రలో ఏపీ సీనియర్ నేత ప్రత్యక్షం!

Advertisement

Next Story

Most Viewed