రైతుతో సహకార సంఘం చెలగాటం.. న్యాయం కావాలంటూ కలెక్టర్‌కు విజ్ఞప్తి

by Manoj |
రైతుతో సహకార సంఘం చెలగాటం.. న్యాయం కావాలంటూ కలెక్టర్‌కు విజ్ఞప్తి
X

దిశ, కామారెడ్డి రూరల్ : నాలుగేళ్ల క్రితం సహకార సంఘంలో ఉన్న బకాయి మొత్తాన్ని నయా పైసా బాకీ లేకుండా చెల్లించాడు ఆ రైతు. బాకీ చెల్లించిన పది రోజులకు సహకార సంఘంలో ఎలాంటి బకాయి లేదని నో డ్యూ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం మళ్ళీ రుణం కావాలని వెళ్లగా... నీ పేరున రూ.30,000 బకాయి ఉంది. చెల్లించి రుణం తీసుకోవాలి అంటూ కార్యదర్శి చెప్తున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని ఆ బాధిత రైతు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన గ్యాధన బోయిన నాగార్జున అనే రైతు ఆ గ్రామంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణం తీసుకున్నాడు. అయితే 24 జులై 2017 తేదీన సహకార సంఘానికి చెల్లించాల్సిన అసలు, వడ్డీ మొత్తం లెక్క చేయించగా 25,300 రూపాయల బాకీ ఉన్నట్టుగా తేలింది. ఈ మొత్తాన్ని అదే రోజున చెల్లించాడు. అదే రోజు అతని పాస్ పుస్తకాలు కూడా తిరిగి ఇచ్చేశారు. 10 రోజుల తర్వాత 05 ఆగస్టు 2017 రోజున 50 రూపాయలు ఫీజు చెల్లించి తాను ఎలాంటి బకాయి లేనట్టుగా నో డ్యూ సర్టిఫికెట్ కూడా ఆ సహకార సంఘం నుంచి తీసుకున్నాడు. తర్వాత ఆంధ్ర బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇటీవల మళ్ళీ తనకు రుణం కావాలని సహకార సంఘానికి వెళ్లి అడగగా.. నీ పేరున 30,000 రూపాయల బాకీ ఉంది అంటూ సంఘం కార్యదర్శి రమేష్ పేర్కొన్నాడు. తాను పూర్తిగా చెల్లించానని చెప్పినా వినిపించుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై విచారణ జరిపి, అధికారులపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ను వేడుకున్నాడు.




Advertisement

Next Story

Most Viewed