'పెళ్లికాని అమ్మాయి' అలా చేయ‌కూడ‌దు.. చైనా కోర్టు సంచ‌ల‌న తీర్పు

by Sumithra |
పెళ్లికాని అమ్మాయి అలా చేయ‌కూడ‌దు.. చైనా కోర్టు సంచ‌ల‌న తీర్పు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఆధునికి ప్రపంచంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అందిరి హక్కుగా మారాయి. స‌మాజానికి హాని క‌లిగించ‌ని స్వేచ్ఛ‌ను కోరుకుంటే త‌ప్పేంటంటూ వ్య‌క్తులు న్యాయాన్ని ఆశ్ర‌యిస్తున్నారు. ఎన్నో పోరాటాల ఫ‌లితంగా, ముఖ్యంగా స్త్రీలలో ఈ మార్పు సుస్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే చైనా రాజధాని బీజింగ్‌లో నివసిస్తున్న తెరెసా జు అనే చైనీస్ మహిళ, త‌న‌ అండాన్ని స్తంభింపజేయడానికి అనుమతి లేద‌ని చెప్పిన‌ కోర్టు తీర్పును విమ‌ర్శించింది. నివేదికల‌ ప్రకారం, బీజింగ్‌లోని చాయోయాంగ్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్ట్ ఈ తీర్పును వెలువ‌రించింది. తెరాసా జు అవివాహిత కావ‌డం వ‌ల్ల ఆమె అండాన్ని స్తంభింపజేయ‌డానికి అనుమ‌తించ‌ట్లేద‌ని పేర్కొంది. అంతేకాదు, ఈ ప్రక్రియను నిరాకరించ‌డం ద్వారా ఆసుపత్రి, ఆసుపత్రి అధికారులు మహిళల హక్కులకు ఎటువంటి భంగం కలిగించలేదని వెల్ల‌డించింది.

అయితే, కోర్టు తీర్పుపై తెరాసా స్పందించారు. "నేను కోల్పోయిన ఈ దావా ఒంటరి మహిళల పునరుత్పత్తి హక్కులపై దాడిగా నేను అనుకోవ‌ట్లేదు. బహుశా దీన్ని తాత్కాలిక ఎదురుదెబ్బగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాలి" అని అన్నారు. 30 ఏళ్ల వ‌య‌సున్న తెరాసా అవివాహితురాలు. అయితే, భవిష్యత్తులో పిల్ల‌ల్నిక‌నే అవకాశం ఉండ‌టం వ‌ల్ల ప్ర‌స్తుతం త‌న అండాన్ని ఫ్రీజ్ చేయాల‌ని వైద్యుల్ని కోరింది. ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవ‌డం కోసం మూడేళ్ల క్రితం క్యాపిటల్ మెడికల్ యూనివర్శిటీలోని బీజింగ్ ప్రసూతి, గైనకాలజీ ఆసుపత్రికి వెళ్లింది. అయితే, ఆమె ప్రాథమిక పరీక్ష ఫ‌లితాలు వ‌చ్చిన‌ తర్వాత, ఆమె విష‌యంలో మ‌రింత ముందుకు కొన‌సాగ‌లేమ‌ని డాక్టర్ తెరాసకు చెప్పారు. ఆమె వివాహ ధృవీకరణ పత్రాన్ని అందించలేకపోవ‌డం వ‌ల్లే ప్రక్రియను తిరస్కరించిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. దీనిపై ఆమె కోర్టుకు వెళ్లింది.

కేసు పెట్టిన‌ దాదాపు మూడేళ్ల తర్వాత తెరాసా జు తాజాగా కోర్టు తీర్పును అందుకుంది. గ‌ర్భం దాల్చ‌డం క‌ష్టంగా ఉన్న మ‌హిళ‌ల‌కే అండాన్ని ఫ్రీజ్ చేసుకోడానికి అనుమ‌తి ఉంటుంద‌ని, ఆరోగ్యంగా ఉన్న మ‌హిళ‌లు ఇలా కాకుండా స‌హ‌జంగానే బిడ్డ‌ల్ని క‌న‌డం మంచిద‌ని డాక్ట‌ర్లు తెరాసా అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించారు. వాస్త‌వానికి, చైనాలో, జాతీయ చట్టం అవివాహితలను సంతానోత్పత్తి చికిత్సల వంటి సేవల నుండి స్పష్టంగా నిషేధించలేదు. "భార్యాభ‌ర్త‌లు" ముగ్గురు పిల్లలను క‌నవ‌చ్చ‌ని పేర్కొంది. కానీ, ఆచరణలో మాత్రం ఇలాంటి కేసుల్లో ఆసుపత్రులు, ఇతర సంస్థలు వివాహ లైసెన్స్‌ను చూపించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, పిల్లల్ని కనాలనుకునే అవివాహిత స్త్రీలు, ప్రసూతి సెలవులు, ప్రినేటల్ పరీక్షల కోసం కవరేజ్ వంటి ప్రజా ప్రయోజనాలను పొంద‌డానికి చాలా కష్టపడాల్సి వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా తెరాసా మాట్లాడుతూ, "మన శరీరాలపై సార్వభౌమాధికారాన్ని మ‌న‌మే తీసుకునే ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది" అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed