అలాంటి గోదాములపై చర్యలు తీసుకోండి: మానవ హక్కుల కమిషన్ చైర్మన్

by Manoj |
అలాంటి గోదాములపై చర్యలు తీసుకోండి: మానవ హక్కుల కమిషన్ చైర్మన్
X

దిశ, ముషీరాబాద్ : సికింద్రాబాద్ బోయిగూడలోని గోడౌన్‌‌లో జరిగిన ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నగరంలో అక్రమ గోదాముల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌లోని బోయిగూడలోని గోడౌన్‌‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది బీహార్ కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఘటనా స్థలాన్ని సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, సికింద్రాబాద్ తహశీల్దార్ బాల శంకర్‌లతో కలిసి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రమాదం గురించి ఆర్డీవో వసంత కుమారిని, ఫైర్ అధికారులను, పోలీసులను, అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి, అగ్ని ప్రమాదం జరగగానే ఫైర్ ఇంజిన్లు ఏ సమయానికి వచ్చాయని చంద్రయ్య అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుండి బయట పడ్డ వ్యక్తి గురించి తెలుసుకున్నారు. గోదాం నిర్వాహకులపై కేసు వేశారా లేదా అని చంద్రయ్య పోలీసులను అడిగారు.


ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించామన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి గోదాంలను పెట్టనివ్వకూడదన్నారు. నగరంలో ఇలాంటి గోదాంలున్నా వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. జరిగిన ఘటనపై అధికారులు ఇన్వెస్ట్‌గేషన్ చేసి, గోదాం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ఫైర్ డీజి మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదంలో 11 మంది బీహార్ కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఎక్కడో బీహార్ నుండి వచ్చి హైదరాబాదులో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఫైర్ డీజి.. ఇక్కడ జరిగిన ఘటన భవిష్యత్తులో మళ్లీ జరిగితే ఎలా తప్పించుకోవాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే అంశాలు తెలుసుకునేందుకు వచ్చానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed