ఎటు చూసినా సంక్షోభమే కనిపిస్తుంది: గుజ్జుల

by S Gopi |
ఎటు చూసినా సంక్షోభమే కనిపిస్తుంది: గుజ్జుల
X

దిశ, పెగడపల్లి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని అధికారంలోకి వచ్చి నేడు సమస్యల తెలంగాణగా మార్చారు అని పెద్దపల్లి మాజీ బీజేపీ ఎమ్మెల్యే , మాజీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జులా రామకృష్ణ రెడ్డి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ ఇన్ చార్జ్ కన్నం అంజయ్యతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటు చూసినా సంక్షోభమే కనిపిస్తుంది అని అన్నారు. ముఖ్యమంత్రి ఎంతో గొప్పలు చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికీ చివరి ఆయకట్టు భూములకు ఎందుకు నీరు అందించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత సేపు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్రంలో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక సీఎం మార్గదర్శకత్వంలో మంత్రులు బీజేపీ నాయకుల నాలుకలు కొస్తాం, తరిమి కొడతాం అనే మాటలు మాట్లాడుతున్నారు అని.. ఎవరు ఎవరి నాలుకలు కోస్తారో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం కానీ ముందైతే చివరి ఆయకట్టు భూములకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించి ఆయకట్టు రైతుల బాధలు తొలగించాలన్నారు.

అభివృద్ధిలో, సంక్షేమ పథకాల్లో దేశానికే ఆదర్శంగా ఉన్నాం అని ఇంకో 20 సంవత్సరాలు మాదే అధికారం అని గొప్పలు చెప్పుకునే సీఎం ఇప్పుడు పక్క రాష్ట్రం నుండి ఎన్నికల వ్యూహకర్తలను అరువు తెచ్చుకుని రాజకీయ కుట్రలకు తెర మీదకు తెచ్చి ప్రజల్లో సానుభూతి పొంది.. దొడ్డి దారిన అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని, పక్క రాష్ట్రాల్లో అమలు చేసిన సానుభూతి వ్యూహాలు ఇక్కడ పని చేయవు అని, తెలంగాణ ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరు అని.. ఆ విషయాన్ని తెలుసుకుని ఇప్పటికైనా సరియైన పరిపాలన చేయాలని హితవు పలికారు. ఒక మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ ని చంపేందుకు కుట్ర చేశారు అంటే అంతటి వ్యక్తిని అంత తేలికగా చంపుతారా?? ఎంత వ్యూహ రచన, పథకాన్ని అమలు చేస్తే చంపడం సాధ్యం అవుతుంది?? ఇదంతా ప్రశాంత్ కిషోర్, సీఎం పన్నిన కుట్ర అని ఆ కుట్రలో మా పార్టీ నాయకులు జితేందర్ రెడ్డి, డీకే అరుణ ప్రస్తావన అనవసరంగా తీస్తున్నారు అని.. అది మానుకోకపోతే తగిన బుద్ది చెప్తాం అని హెచ్చరించారు. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని.. దానికి కార్యకర్తలు అంతా కృషి చేయాలి అని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ ఇన్ చార్జ్ కన్నం అంజయ్య, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు, బతికే పెళ్లి ఎంపీటీసీ చింతకింది అనసూర్య, మండల బీజేపీ అధ్యక్షుడు గంగుల కొమురెల్లి, నాయకులు పెంట నరేందర్, చింతకింది కిషోర్, బోగా లతిశ్, సంకీటి రవీందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story