కేసీఆర్ టవర్స్‌లో తాగునీటి కోసం డబ్బులు కట్టాలంటా..!

by Vinod kumar |
కేసీఆర్ టవర్స్‌లో తాగునీటి కోసం డబ్బులు కట్టాలంటా..!
X

దిశ, ఖమ్మం టౌన్: నగరంలోని కేసీఆర్ టవర్స్ లో వారం రోజులుగా నీటి ఎద్దడి కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పథకాల్లో ఒకటైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అనే పథకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పథకంతో పేద ప్రజల సొంత ఇంటి కల నిజం చేసుకున్నారు. నగరంలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ టవర్స్‌లో పేదలకు ఇల్లు అందించారు.


కానీ ఇక్కడ సరైన సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలకు తాగడానికి మంచినీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని టవర్స్ ఇన్‌చార్జ్ దృష్టికి తీసుకువెళ్లినా.. తను మీకు నీళ్లు రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి తమను డబ్బులు అడుగుతూ టవర్స్ ఇన్‌చార్జ్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంతవరకు తమ టవర్స్ లో కొన్ని బ్లాకులకు మాత్రమే నీటి పంపులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా చాలా బ్లాక్ లో నీటి కోసం పైపులైను వేయలేదని.. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.


తమకు మిషన్ భగీరథ పైపుల ద్వారా నీరు అందిస్తామని చెప్పిన అధికారులు.. ఇంతవరకు తమను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రెండు మూడు రోజులకోసారి వచ్చే వాటర్ ట్యాంకుల వల్ల ఒకరికొకరు గొడవలు పడాల్సి వస్తుందని, చాలీచాలని నీటితో తాము ఇబ్బందులు పడుతున్నమని తెలిపారు. ప్రస్తుతం ఎండాకాలం కావున నీటి అవసరం ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ట్యాంకుల ద్వారా వచ్చే నీరు తమకు ఏ విధంగా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి.. కేసీఆర్ టవర్స్ లో నీటి ఎద్దడిని తొలగించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed