ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు జెట్ ఇంధన ధరలు!

by Manoj |
ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు జెట్ ఇంధన ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి పెరిగిన నేపథ్యంలో బుధవారం జెట్ ఇంధన ధరలు రికార్డు స్థాయిలో 18 శాతానికి పైగా పెరిగాయి. దీంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్(ఏటీఎఫ్) ధరలు చరిత్రలోనే మొదటిసారిగా కిలోలీటర్‌కు రూ. లక్ష మార్కును అధిగమించింది. ఏటీఎఫ్ ధరలను ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరిస్తారు.

తాజాగా పెంచిన ధరలతో ప్రస్తుత ఏడాది వరుసగా ఆరో సారి పెంపు నిర్ణయం కొనసాగింది. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర 18.3 శాతం అంటే రూ. 17,135.63 పెరిగి రూ. 1,10,666కి చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితుల మూలంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయంతో చమురు ధరలతో పాటు విమాన ఇంధన ధరలు కూడా పెరగడంతో ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ప్రస్తుత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏటీఎఫ్ ధరలు 50 శాతం పెరగడం గమనార్హం. తాజా ధరల ప్రకారం.. ముంబైలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ. 1,09,119గా ఉండగా, కోల్‌కతాలో రూ. 1,14,980, చెన్నైలో రూ. 1,14,134గా ఉంది. గతవారంలో అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 140 డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. అయితే, అనంతర పరిణామాల్లో బుధవారం ఉదయం నాటికి చమురు ధరలు రికార్డు స్థాయి నుంచి బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే తక్కువకు దిగొచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed