అష్నీర్ గ్రోవర్ ఇక తమ ఉద్యోగి కాదు: భారత్‌పే అధికారిక ప్రకటన!

by Disha Desk |
అష్నీర్ గ్రోవర్ ఇక తమ ఉద్యోగి కాదు: భారత్‌పే అధికారిక ప్రకటన!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం భారత్‌పేలో జరిగిన సంఘటనల మధ్య ఇటీవల సంస్థ సహ-వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్‌ను కంపెనీ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ జరిపిన అంతర్గత దర్యాప్తులో దంపతులిద్దరు సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్టు కంపెనీ అధికారికంగా బుధవారం స్పందించింది. అష్నీర్ గ్రోవర్, మాధురి జైన్, వారి బంధువులు కంపెనీలోని నిధులను భారీగా దుర్వినియోగం చేయడమే కాకుండా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించారు. దీనిద్వారా వారు కంపెనీ నిధులను వ్యక్తిగత అవసరాలను ఖర్చు చేశారని భారత్‌పే ఓ ప్రకటనలో తెలిపింది. వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కంపెనీకి అన్ని హక్కులు ఉన్నాయి. అష్నీర్ గ్రోవర్ ప్రవర్తన భారత్‌పే ప్రతిష్టను దెబ్బతీసేదిలా ఉందని, కంపెనీ కోసం కష్టపడి పనిచేసే ఉద్యోగులు, గ్లోబల్ స్థాయిలో పేరున్న కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సంస్థ బోర్డు అనుమతించదు. ఈ చర్యలతో అష్నీర్ గ్రోవర్ ఇక భారత్‌పే వ్యవస్థాపకుడు, డైరెక్టర్, ఉద్యోగి కాదని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాకుండా సంస్థ అంతర్గతంగా దర్యాప్తు జరుపుతున్న సమాచారంతోనే అష్నీర్ గ్రోవర్ రాజీనామాను ఇచ్చారని ఆరోపించింది.

Advertisement

Next Story