ఇక కృత్రిమంగా కిరణజన్య సంయోగ క్రియ.. సూర్యుడు అవసరమే లేదు!

by Manoj |
ఇక కృత్రిమంగా కిరణజన్య సంయోగ క్రియ.. సూర్యుడు అవసరమే లేదు!
X

దిశ, ఫీచర్స్ : మొక్కలు సూర్యకాంతి సమక్షంలో వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ని వినియోగించుకొని ఆహారాన్ని (పిండిపదార్థాలను) తయారుచేసుకోవడాన్ని 'కిరణజన్య సంయోగ క్రియ' అంటారన్న విషయం తెలిసిందే. అయితే ఈ రసాయన చర్యకు మూలం 'సూర్యకాంతి' కాగా.. సూర్యుడు లేకుండా చీకట్లోనూ మొక్కలను మరింత సమర్ధవంతంగా పెంచేందుకు శాస్త్రవేత్తలు కృత్రిమ కాంతిని సృష్టించారు. ఇది తగినంత సూర్యరశ్మిని పొందని ప్రాంతాలకు వ్యవసాయాన్ని విస్తరించేందుకు దోహదపడనుంది. అంతేకాదు భవిష్యత్తులో అంతరిక్ష అన్వేషకులకు ఆహారం అందించడంలో కూడా సాయపడుతుంది.

జంతువులన్నింటికీ కిరణజన్య సంయోగక్రియనే జీవనాధారం. ఇది భూమిపై బిలియన్ల సంవత్సరాల పాటు జీవం వృద్ధి చెందడానికి సహాయపడింది. నిజానికి సూర్యశక్తిలో కేవలం మూడు నుంచి ఆరు శాతం శక్తిని మాత్రమే మొక్కలు వినియోగించుకుంటాయి. దీంతో చాలా కాలంగా కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ కల ఇప్పటికి నిజం కాగా ఇది సహజ ప్రక్రియ కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఇంధనం, సింగస్, మిథనాల్, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు సహా ఔషధ అణువులు తయారుచేయొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రక్రియలో ఎసిటేట్‌ను కార్బన్ మూలంగా మొక్కలకు అందించడం ద్వారా మొక్కలు కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. ఈస్ట్, గ్రీన్ ఆల్గే, ఫంగల్ మైసిలియం, కౌపీయా, టొమాటో, పొగాకు, బియ్యం, కనోలా, పచ్చి బఠానీలతో సహా పంట మొక్కలు, ఆహారాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవుల శ్రేణిపై ఈ సాంకేతికతను పరీక్షించారు. ఈ మేరకు చీకట్లో మొక్కలకు ఎసిటేట్ ఇవ్వడం ద్వారా ఈ టెస్టు చేయగా, కొన్ని సందర్భాల్లో సూర్యకాంతి కంటే మరింత సమర్థవంతంగా మొక్కల్ని పెంచడం సాధ్యమేనని నిర్ధారించారు. ఉదాహరణకు, ఆల్గే నాలుగు రెట్లు ఎక్కువ సమర్ధవంతంగా పెరిగితే, ఈస్ట్ ఆశ్చర్యకరంగా 18 రెట్లు అధికంగా పెరగడం విశేషం. పంట దిగుబడిని పెంచేందుకు అదనపు శక్తి వనరుగా ఎసిటేట్‌తో పంటలను పండించవచ్చని పరిశోధకుల బృందం అభిప్రాయపడింది.

సూర్యకాంతి తక్కువగా/లేని ప్రాంతాల్లో ఈ సాంకేతికతను ఉపయోగించి ఆహారాన్ని పండించవచ్చు. నగరాల్లో, అంతరిక్షంలో లేదా ఇతర గ్రహాల్లో కూడా సాధ్యమే. ఇది NASA డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్ మొదటి దశలో ప్రాజెక్ట్ విజయాన్ని సాధించింది. ఆహార ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తక్కువ భూమి అవసరమవుతుంది. పర్యావరణంపై వ్యవసాయం ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతరిక్షం వంటి సాంప్రదాయేతర వాతావరణాల్లో తక్కువ ఇన్‌పుట్‌లతో ఎక్కువ మంది సిబ్బందికి ఆహారం అందించడంలో సహాయపడుతుంది.

- రాబర్ట్ జింకర్సన్, శాస్త్రవేత్త

Advertisement

Next Story

Most Viewed