Andhra Pradesh cabinet : ఆంధ్రా 'ఏపీఎల్'​.. మంత్రివర్గంపై జోరుగా బెట్టింగ్‌లు!

by GSrikanth |   ( Updated:2022-04-10 09:04:53.0  )
Andhra Pradesh cabinet : ఆంధ్రా ఏపీఎల్​.. మంత్రివర్గంపై జోరుగా బెట్టింగ్‌లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా పొలిటికల్​లీగ్ సాగుతోంది. ఏపీలో కొత్త మంత్రివర్గంపై బెట్టింగ్​ కొనసాగుతోంది. ఈ రెండు రోజుల నుంచి ఈ దందా మరింత పెరిగింది. పాత మంత్రులతో పాటుగా కొత్తగా ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటారనే అంశంపై చాలెంజ్​సాగుతోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ వంటి ప్రాంతాల్లో ఈ బెట్టింగ్‌కు వేదికగా మారింది. అంతేకాకుండా ఏపీకి చెందిన పలువురు రాజకీయ నేతలు, బెట్టింగ్​రాయుళ్లు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో మకాం వేశారు.

లక్ష నుంచి పది లక్షలు

ఏపీలో కొత్త మంత్రివర్గం సోమవారం కొలువుదీరుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయ, కుల సమీకరణాలు, మహిళల వారీగా మంత్రివర్గం ఖరారైందని తెలుస్తూనే ఉంది. ఆల్రెడీ పాత మంత్రుల రాజీనామాలు ఆమోదించారు. దీంతో కొత్త మంత్రుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సీఎం జగన్‌తో పాటుగా ఆయన సన్నిహితులు, రాజకీయ సలహాదారుల సమక్షంలో కొత్త మంత్రుల ఎంపిక చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సీఎం జగన్​.. కొంతమందికి హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎవరెవరికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. కొంతమందిపై క్లారిటీ వస్తున్నా.. సీఎం జగన్​ ప్రకటన తరువాయి. కాగా, మహిళల కోటా నుంచి విడుదల రజినీ, ధనలక్ష్మీ, రోజా పేర్లు చక్కర్లు కొడుతున్నా ఈసారి రోజాకు అవకాశంపై తర్జనభర్జన కొన సాగుతోంది. ఈ నేపథ్యంలో విడుదల రజినీకి మంత్రివర్గంలో తప్పనిసరి ఉంటారని అంచనా వేస్తున్నారు.

అయితే, కొత్త మంత్రులు 15 మంది, పాత మంత్రులు 10 మంది ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. కొడాలి నానికి తప్పనిసరిగా అవకాశం కల్పిస్తున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన పలువురు హైదరాబాద్​లో రూ. 10 లక్షల వరకు బెట్టింగ్​ పెడుతున్నారు. ప్రధానంగా కొడాలి నాని, బుగ్జన రాజేంద్రప్రసాద్, విడుదల రజినీ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్​, జోగి రమేష్, ధర్మాన ప్రసాదరావు పేర్లపై బెట్టింగ్​ఎక్కువగా ఉంటుంది. రూ.1 లక్ష నుంచి మొదలుకుని రూ. 10 లక్షల వరకు బెట్టింగ్​ పెడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ బెట్టింగ్‌ల ప్రక్రియ సాగుతోంది. పలు హోటళ్లలో బెట్టింగ్ రాయుళ్లు మకాం వేశారు. ఐపీఎల్​ కంటే జోరుగా ఇప్పుడు ఏపీ మంత్రివర్గ బెట్టింగ్​జరుగుతోంది.

Advertisement

Next Story