పాముని కాపాడ‌టం కోసం ఇంటిని కూల్చారు.. షాకింగ్ వీడియో!

by Sumithra |
పాముని కాపాడ‌టం కోసం ఇంటిని కూల్చారు.. షాకింగ్ వీడియో!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః వ‌న్య ప్రాణుల్ని కాపాడటం కోసం ఏకంగా ఇంటినే కూల్చ‌డం షాకింగ్‌గానే అనిపిస్తుంది. సాధార‌ణంగా పాము క‌నిపిస్తే, చాలా మంది దాన్ని చంపేయాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. కొంద‌రు రెస్క్యూ బృందాన్ని సంప్ర‌దించి, ఎంత క‌ష్ట‌మైనా పామును ప‌ట్టి సుర‌క్షిత ప్రాంతంలో వ‌దిలేస్తారు. అయితే, రెండు గోడల మధ్య చిక్కుకున్న నాగుపాము ప్రాణాలను రక్షించడానికి ఇంటిలో స‌గ‌భాగం కూల్చివేశారిక్క‌డ‌. హర్యానాలోని ఫతేహాబాద్‌లోని తోహానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గోడలు కూల్చివేయక‌పోతే, బయటకు రాలేని స్థితిలో రెండు ఇళ్ల గోడల మధ్య ఓ నాగుపాము ఇరుక్కుపోయింది. నాగుపామును రక్షించేందుకు ఇంటిలోని కొంత భాగం గోడను, పైకప్పును బద్దలు కొట్టాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను India.com ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. "అద్భుతమైన రెస్క్యూ ఆఫ్ రెస్క్యూ చూడండి" అని క్యాప్ష‌న్ పెట్టింది.

ఈ ఘ‌ట‌న‌పై వన్యప్రాణి సంరక్షణ బృందం సభ్యుడు నవజోత్ ధిల్లాన్ వివరాలు తెలిపారు. బల్లియావాలాలోని ఇంట్లో పాము కనిపించినట్లు సమాచారం అందిందని ఆయ‌న చెప్పారు. పామును బయటకు తీయడానికి టీమ్ తీవ్రంగా ప్రయత్నించగా, వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరే ఇతర మార్గం లేకపోవడంతో, రెస్క్యూ బృందం ఇంటి యజమాని అనుమతి తీసుకొని, ఇంటిలో కొంత భాగం గోడ, పైకప్పును కూల్చివేశారు. ఎట్టకేలకు పామును రక్షించారు. ఇంత విశేషంతో కూడుకున్న‌ నాగుపామును చూసేందుకు భారీగా జనం గుమ్మిగూడారు. అనంతరం వన్యప్రాణి సంరక్షణ బృందం పామును సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed