ఉత్తరప్రదేశ్‌లో ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ పోలింగ్

by Disha Desk |
ఉత్తరప్రదేశ్‌లో ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ పోలింగ్
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గురువారం జరిగిన తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ యూపీలో 58 స్థానాల్లో పోలింగ్ జరగ్గా సమయం ముగిసే సరికి 60.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2017 ఎన్నికల్లో 63.5శాతం నమోదు కాగా, ఈ సారి కాస్త తక్కువ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ మొరాయించడంతో వెంటనే మార్చినట్లు ప్రధాన ఎన్నికల అధికారి అజయ్ కుమార్ శుక్లా తెలిపారు. ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తలేదని చెప్పారు. షమ్లీ ప్రాంతంలో ఆరెల్డీ అభ్యర్థి ప్రసన్న చౌదరీ మహిళ ఓటర్లతో దురుసుగా ప్రవర్తించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు గతంలో 58 స్థానాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి రైతు చట్టాల నిరసన నేపథ్యంలో సంఖ్య మారనున్నట్లు తెలుస్తోంది. అయితే 58 స్థానాల్లో 623 మంది పోటీకి దిగారు. మొదటి దశ ఎన్నికల్లో భద్రతా కోసం 800 కంపెనీల కేంద్ర పోలీసు దళాలు మోహరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఓటు వేయని ఆరెల్డీ చీఫ్


రాష్ట్రీయ లోక్ దళ్ (ఆరెల్డీ) చీఫ్ జయంత్ చౌదరీ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ విషయాన్ని మధుర జిల్లా అధ్యక్షుడు బాబులాల్ ప్రసాద్ తెలిపారు. 'జయంత్ చౌదరీ మధురలో తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన రెండో ఎన్నికల ప్రచారానికి వేరే జిల్లాల్లో ఉన్నారు. ప్రయత్నం చేసిన పోలింగ్ ముగిసే సమయానికి ఆయన చేరుకోలేకపోయారు' అని తెలిపారు. కాగా అంతకుముందు ఉదయం తన భార్య ఓటు హక్కు వినియోగించుకున్నట్లు జయంత్ చౌదరీ చెప్పారు. తాను కూడా ప్రచారం తర్వాత ఓటు వేస్తానని అన్నారు. అయితే ప్రచారం నుంచి పోలింగ్ బూత్ నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయారు. దీనిపై ఇతర పార్టీల నేతలు జయంత్ చౌదరీకి బాధ్యత లేదని విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed