‘చేతి’కి చిక్కిన ‘వైఎస్సార్‌టీపీ’.. ఇక షర్మిలకు మిగిలింది ఆ ఒక్క ఆప్షనేనా!

by GSrikanth |
‘చేతి’కి చిక్కిన ‘వైఎస్సార్‌టీపీ’.. ఇక షర్మిలకు మిగిలింది ఆ ఒక్క ఆప్షనేనా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా తన తండ్రి పేరిట పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల కాంగ్రెస్‌తో జతకట్టనుందా? పొత్తు ప్రస్తావన లేకుండా ఏకంగా పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమవుతుందా? వైఎస్సార్ సంక్షేమ పాలన అంశాన్ని పక్కన పెట్టేసి వ్యక్తిగత రాజకీయాలే తనకు ముఖ్యమని షర్మిల భావిస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు పార్టీలు తమకు కాల్ చేస్తున్నాయని, తాము ఎవరి కాల్ అటెండ్ చేయడం లేదని బాహటంగానే చెప్పిన షర్మిల మొత్తానికి కాంగ్రెస్ కాల్ అటెండ్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య సంప్రదింపులు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన అప్ డేట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

తెలంగాణలో అధికారంలోకి రాబోయే పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీయేనని, సీఎం కాబోయేది తానేనని షర్మిల బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తమకు ఇతర పార్టీల నుంచి లీడర్లు రావాల్సిన అక్కర్లేదని, తాము లీడర్లను సృష్టించుకుంటామని ఆమె గతంలో ప్రస్తావించింది. కానీ చివరకు ‘వైఎస్సార్ టీపీ’.. ‘చేతి’కి చిక్కిందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వైఎస్సార్ టీపీ ఏర్పాటు అనంతరం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. గుర్తింపు ఉన్న లీడర్ లేకపోవడంతో కేడర్ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. పార్టీ ఇలాగే ఉంటే ఉనికి ప్రమాదకరంగా మారే అవకాశముందని భావించిన షర్మిల కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్‌తో నేరుగా భేటీ అయి హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.

ఈ ఏడాది తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని షర్మిల భావించింది. కానీ హస్తం పార్టీ పెద్దలు పొత్తుకు ససేమిరా చెప్పినట్లుగా సమాచారం. విలీనం చేయాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు కరాఖండిగా చెప్పినట్లుగా తెలస్తోంది. దీంతో షర్మిలకు మరో ఆప్షన్ లేకుండా పోయినట్లుగా టాక్. వారు పెట్టిన కండిషన్‌తో షర్మిల డైలమాలో పడినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్సార్ టీపీకి షర్మిల తర్వాత ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎలాగూ పార్టీకి కేడర్ లేదనే భావనలో షర్మిల ఉన్నట్లు వినికిడి. ఇలాగే ఎన్నికలకు వెళ్తే ఓట్లు పడవని, డిపాజిట్లు గల్లంతవుతాయనే భయంతో విలీనానికి సైతం ఒకే చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో డీకే శివకుమార్ చర్చలు దాదాపు పూర్తికావచ్చాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని వినికిడి.

కాంగ్రెస్‌తో వైఎస్సార్ టీపీ పొత్తు అయినా, విలీనం చేసినా కాంగ్రెస్‌కే నష్టమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో చెప్పారు. షర్మిల రావడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదని ఆయన కామెంట్స్ చేసినట్లు వినికిడి. కాగా దీనికి సంబంధించిన అంశంపై రేవంత్ రెడ్డి హైకమాండ్ కు సైతం నివేదిక పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో ఆంధ్రుల పెత్తనం ఎందుకని, ఆమె ఇక్కడకు కాకుండా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి పాలిటిక్స్ చేసుకుంటే బాగుంటుందని సూచించినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో సంక్షేమ పాలన లేకుండా పోయిందని 9 ఫిబ్రవరి 2021లో నూతన పార్టీని ఏర్పాటు చేసింది. అట్టహాసంగా పార్టీ లాంఛ్‌ను చేపట్టింది. తన తండ్రి మరణించినా అతడిపై లేనిపోని కేసులు పెట్టించిన పార్టీ అని కాంగ్రెస్‌పై ఘాటుగానే విమర్శలు చేసింది. తీరా సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే పార్టీ ‘చేతి’కి వైఎస్సార్ తెలంగాణ పార్టీ చిక్కింది. రాజన్న సంక్షేమ పాలన అంశాన్ని పక్కన పెట్టేసి రాజకీయాలే తనకు ముఖ్యమని దీంతో షర్మిల స్పష్టం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా కార్యకర్తల భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నిరోజులు పార్టీని నమ్ముకుని పనిచేస్తే తమ జీవితాలు సందిగ్ధంలో పడ్డాయనే డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో జాయినింగ్స్, పార్టీ గ్రోత్ పెరగడం లేదని వాస్తు మార్పిడికి సిద్ధమైన షర్మిలకు విలీనం చేస్తే అయినా కలిసొస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Also Read: కేసీఆర్‌కు ఊహించని షాక్.. బీఆర్ఎస్‌తో ‘దోస్తీ’ తెంచుకునేందుకు సిద్ధమైన MIM..!

Advertisement

Next Story

Most Viewed