పొత్తులపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-30 17:39:30.0  )
పొత్తులపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మాది మహిళలు, రైతులు, యువతతో కూడుకున్న టీం అని, అధికారం కోసం ఎవరితో పొత్తులు ఉండవు’ అని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్ మార్కెండేయ రథయాత్రలో బుధవారం మంత్రి మహమూద్ అలీతో కలిసి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోలాపూర్ అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మార్కెండేయస్వామి పురాతన ఆలయంలో ప్రతి రాఖీ పౌర్ణమికి రథయాత్ర ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని, ఈ రథయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మార్కండేయ ఆలయాభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున కోటి రూపాయల విరాళంను సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. మహారాష్ట్ర ప్రజలు కలిసి మెలిసి ఐక్యతను చాటుకోవాలని పిలుపు నిచ్చారు.

పద్మశాలీలు బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇతర అన్ని రాష్ట్రాలు తెలంగాణ వలే అభివృద్ధి సాధించాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమన్నారు. దేశంలో అత్యధిక రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న పరిపాలకులు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే నిరంతరం ప్రయత్నాలు చేస్తారు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. కేసీఆర్ పోరాటంతో తెలంగాణ సాధించుకొని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. బీఆర్ఎస్ ను ఆశీర్వదిస్తే తెలంగాణ మోడల్ అవుతుందన్నారు. అనంతరం సోలాపూర్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం బాల్ కోటిమైదానం, ఈద్గా మైదానాలను రెండు చోట్ల స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్రపార్టీ ఇన్ చార్జి కల్వకుంట్ల వంశీరావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నాయకులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story