తెలంగాణకు అదనపు బలగాలు.. మొత్తం 90వేల మంది సిబ్బందితో భద్రత!

by GSrikanth |   ( Updated:2023-10-14 04:20:43.0  )
తెలంగాణకు అదనపు బలగాలు.. మొత్తం 90వేల మంది సిబ్బందితో భద్రత!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికలకు కౌంట్​డౌన్​ మొదలైన నేపథ్యంలో పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్పీలు కమిషనరేట్ల కమిషనర్ల నుంచి బందోబస్తు స్కీములను తెప్పించుకున్న పోలీస్​బాసులు ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తును ముమ్మరం చేశారు. ఈసారి ఎన్నికల బందోబస్తు కోసం 3వందలకు పైగా కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు అవసరమవుతాయని ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లిఖితపూర్వకంగా తెలియచేశారు. దీనికి కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించినట్టు సమాచారం. దాంతోపాటు ఎన్నికలు లేని రాష్ర్టాల నుంచి కూడా పోలీసులు బందోబస్తు కోసం రానున్నారు. ఈసారి రాష్ర్ట పోలీసులు, కేంద్ర పారా మిలటరీ బలగాలు, ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నవారు కలిపి మొత్తం 90వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియవచ్చింది.

మూడోసారి గెలిచి హ్యాట్రిక్​కొట్టాలని బీఆర్ఎస్​ ప్రయత్నిస్తుంటే ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కాగా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర పారా మిలటరీ బలగాలతోపాటు కర్ణాటక, ఒడిషా, మహారాష్ర్టల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన ప్రకారం ఈసారి సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ర్యాపిడ్​ యాక్షన్​ఫోర్స్, ఇండో టిబెటిన్​ బోర్డర్​ పోలీసు యూనిట్ల నుంచి మొత్తం 3వందలకు పైగా కంపెనీలు విడతల వారీగా రాష్ర్టానికి రానున్నాయి. పది రోజుల్లో 70 నుంచి 80 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు మొదటి విడతగా రాష్ర్టానికి చేరుకోనున్నాయి.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో..

మొదటి విడతలో రానున్న కేంద్ర పారామిలటరీ బలగాల్లో సింహ భాగాన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించనున్నట్టు సమాచారం. మహారాష్ర్ట, ఛత్తీస్​ఘడ్, ఒడిషా సరిహద్దుల్లోని మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్నట్టు ఇప్పటికే ఇంటెలిజెన్స్​వర్గాల నివేదికలు ఉన్నాయి. వీటిలో ఆసిఫాబాద్, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, యెల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, బెల్లంపల్లి, సిర్పూర్​(టీ) తదితర నియోజకవర్గాలున్నాయి. పోలింగ్​కు కనీసం నెల రోజుల ముందు ఈ బలగాలను విధుల్లోకి దింపితే ఆయా ప్రాంతాలపై వారికి పట్టు పెరుగుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసిన అనుభవం ఉన్న అధికారులు ఈ ప్రత్యేక బలగాలతోపాటు ఉంటారని తెలియచేశాయి.

సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లోనూ..

ఇక, సమస్యాత్మక, సున్నితమైనవిగా గుర్తించిన నియోజకవర్గాలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 6వేల సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్​ కేంద్రాలు ఉన్నట్టుగా నిఘా వర్గాలు ఇప్పటికే రిపోర్టు ఇచ్చాయి. ఈ క్రమంలో ఆయా పోలింగ్​స్టేషన్ల పరిధుల్లో అదనపు బలగాలను మోహరించనున్నారు. ఇక ఈసారి ఎన్నికల విధుల్లో మన రాష్ర్టానికి చెందిన దాదాపు 35వేల మంది పోలీసులు ఉంటారు. ప్రస్తుతం రాష్ర్టంలో 497 పోలీస్​స్టేషన్లు ఉండగా 90వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో 35వేల మందిని ఎన్నికల బందోబస్తు కోసం వినియోగించుకోనున్నారు.

ఒక్కో కంపెనీలో..

ఎన్నికల విధుల కోసం రానున్న కేంద్ర పారా మిలటరీ బలగాల ఒక్కో కంపెనీలో 12‌‌0 నుంచి 130 సిబ్బంది ఉండనున్నారు. వీరిలో సుబేదార్​ అసిస్టెంట్, ఇన్స్​పెక్టర్, సబ్​ఇన్స్​పెక్టర్, హెడ్​కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ఉంటారు. ఈ లెక్కన మొత్తం 300 కంపెనీలలో కేంద్ర పారా మిలటరీ బలగాల సంఖ్య 36వేలకు పైగానే ఉంటుందని పోలీసువర్గాలు తెలియచేశాయి.

Advertisement

Next Story

Most Viewed