Khammam : ఆపరేషన్ ఖమ్మం.. పొంగులేటిని ఇరుకున్న పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్!

by GSrikanth |   ( Updated:2023-08-18 05:56:26.0  )
Khammam :  ఆపరేషన్ ఖమ్మం.. పొంగులేటిని ఇరుకున్న పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/ఖమ్మం బ్యూరో: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ లో చేరినా ఆయన ఎఫెక్ట్ బీఆర్ఎస్ లీడర్లను వెంటాడుతూనే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదారు అసెంబ్లీ సెగ్మంట్లలో ఆయన ప్రభావం ఉంటుందని అనుమానం బీఆర్ఎస్‌కు పట్టుకుంది. అందుకని పొంగులేటిని బలహీనపరిచేందుకు ఆయన ప్రధాన అనుచరులను బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు.

బీఆర్ఎస్ కు ఖమ్మం టెన్షన్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అంత సులువు కాదని పలు సంస్థల సర్వేలు రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అక్కడ ఎలా పాగా వేయాలని టెన్షన్ లో కేసీఆర్ ఉన్నట్టు టాక్ ఉంది. ఈసారి ఎలాగైనా మేజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న కేసీఆర్ పొంగులేటిని బలహీన పరచాలనే వ్యూహానికి తెర తీసినట్టు తెలిసింది. పొంగులేటి ప్రభావం చూపే సెగ్మంట్ లోని అనుచరులకు గాలం విసేరే ప్లాన్ కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తెల్లం వెంకట్రావును చేర్చుకున్న బీఆర్ఎస్ పెద్దలు, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పై దృష్టి పెట్టినట్టు తెలిసింది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో భద్రాచలం టికెట్ కేటాయిస్తామన్న హామీతో బీఆర్ఎస్ లో తెల్లం చేరారని అనుచరులు అంటున్నారు. అంతేకాకుండా భద్రాచలానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని మొదటి దశలో కొన్నినిధులు కూడా విడుదల చేస్తామన్న ప్రకటన మేరకే వెంకట్రావ్ ఒప్పుకున్నట్లు సమాచారం.

ఆఫర్ల మీద ఆఫర్లు

పొంగులేటి అనుచరులు తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తే పదవులు ఇస్తామని కొందరికి, కాంట్రాక్టులు ఇస్తామని మరికొందరికి ఆశలు పెడుతున్నారు. అందులో భాగంగా తెల్లం వెంకట్రావు గులాబీ పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. 2018లో భద్రాచలం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంకట్రావు, పొంగులేటితో పాటు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే భద్రాచలం లో కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే పోడం వీరయ్య ఉన్నారు. దీంతో ఆయనకు త్వరలో జరిగే ఎన్నికల్లో టికెట్ కష్టమని సంకేతాలు కాంగ్రెస్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తామని కేసీఆర్ ఆఫర్ పెట్టడంతో వెంకట్రావు పార్టీ మారినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలోకి వస్తే పలు కాంట్రాక్టులతో పాటు జిల్లాలో ప్రోటోకాల్ కు ఇబ్బందులు లేకుండా చూస్తామని బుజ్జగిస్తున్నట్టు సమాచారం. అయితే ఏజెన్సీ ప్రాంతంలోని రెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నా.. అందులో వాస్తవం లేదని పొంగులేటి వర్గీయులు కొట్టిపడేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed