ప్రధాని పర్యటన వేళ టెన్షన్‌లో టీ.బీజేపీ నేతలు.. మరోసారి ఆగ్రహానికి గురికాక తప్పదా?

by GSrikanth |   ( Updated:2023-10-01 02:30:14.0  )
ప్రధాని పర్యటన వేళ టెన్షన్‌లో టీ.బీజేపీ నేతలు.. మరోసారి ఆగ్రహానికి గురికాక తప్పదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాషాయ పార్టీ అయోమయంలో పడిపోయింది. నేతలు కూడా తలోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల టైం దగ్గరపడుతున్న క్రమంలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాల్సిన నేతలు వారే ఇరుకున పడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు అనేక సార్లు ఇరకాటంలో పడిపోయారు. మరో వైపు బీజేపీ అగ్ర నేతల పర్యటనలకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో రాష్ట్ర నాయకత్వానికి వెన్నులో వణుకు పుడుతున్నది. గతంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాజాగా ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ స్టేట్ లీడర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. జన సమీకరణ కోసం ముప్పు తిప్పలు పడాల్సి వస్తున్నది.

జన సమీకరణ కత్తిమీద సాము..

గతంలో ప్రధాని మోడీ, షా మీటింగులు వెలవెలబోవడంతో ఇప్పుడు జన సమీకరణ రాష్ట్ర నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. పబ్లిక్‌ను తరలించేందుకు నేతలు సైతం నిరాసక్తత చూపిస్తున్నారు.

బండి మార్పుతో నైరాశ్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించడంతో ఆ పార్టీ డీలా పడటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. బండి మార్పుతో నేతల్లో నైరాశ్యం నెలకొన్నది. ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్న టైంలో ఏ కార్యక్రమం నిర్వహించినా జనం భారీగా తరలి వచ్చేవారు. కానీ, ఇప్పుడు జనం తరలింపు కిషన్‌రెడ్డికి సవాలుగా మారింది.

వస్తామంటే.. వద్దన్నారు..

పలువురు పేరున్న నేతలు తామే పార్టీలో చేరుతామన్నా చేర్చుకోలేదు. మాజీ మంత్రి కృష్ణయాదవ్, చికోటి ప్రవీణ్ విషయంలో ఇదే జరిగింది. ఎట్టకేలకు ఎలాంటి ఆర్భాటం లేకుండానే కృష్ణయాదవ్ శనివారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తొలుత చేరేందుకు పార్టీ ఒకే చెప్పి చివరి క్షణంలో నో చెప్పడంతో చేరికకు అంతా సిద్ధం చేసుకున్న పలువురు నేతలు కంగుతిన్నారు. చేరే వారిని అడ్డుకోవడంతో బీజేపీ ప్రతిష్ఠ మరింత దిగజారిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

మోడీ, షా సభలు వెలవెల

కొన్ని నెలల క్రితం వరంగల్‌లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి నేతలు అనుకున్న స్థాయిలో జనం రాలేదు. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభకు కూడా జనం అనుకున్నంత మేరకు రాలేదు. దీంతో అమిత్‌షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నేతలపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జాయినింగ్స్ విషయంలోనూ ఫైర్ అయినట్లు టాక్. ఇప్పుడా భయమే రాష్ట్ర నాయకత్వానికి వణుకు పుట్టిస్తున్నది. అనుకున్న స్థాయిలో జన సమీకరణ జరగకపోతే మరోసారి అగ్ర నేతల ఆగ్రహానికి గురికాక తప్పదా? అనే ఆందోళన నేతలను కలవర పెడుతున్నది.

వరుసగా అగ్ర నేతల పర్యటనలు

రాష్ట్రంలో బీజేపీ అగ్ర నేతల పర్యటనలు వరుసగా కొనసాగనున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే ప్రధాని మోడీ రెండు సార్లు పర్యటించనున్నారు. అక్టోబర్ 6వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తెలంగాణకు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉన్నది. ఒక్క సభకు జన సమీకరణకే బోలెడంత ఖర్చవుతుండగా నేతలు సైతం పెద్దగా పట్టించుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. దీంతో జన సమీకరణ చేపట్టడం ఎలా అనే అంశంపై రాష్ట్ర నాయకత్వం తర్జన భర్జన పడుతోంది.

తలనొప్పిగా తిరుగుబాటు నేతల కూటమి!

అగ్ర నేతల ఆగ్రహానికి తోడు బీజేపీలో తిరుగుబాటు నేతలు కూటమిగా ఏర్పడటం ఇప్పుడు పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. తిరుగుబాటు నేతల వరుస సీక్రెట్‌ మీటింగ్స్‌ బీజేపీ నాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఈ రెబల్‌ గ్రూప్‌‌లో పలువురు సీనియర్లతో పాటు మాజీ ఎంపీలూ ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీరు నచ్చక కొందరు, ప్రాధాన్యత దక్కడంలేదని కొందరు, ఈటల రాజేందర్ వ్యవహార శైలి నచ్చక కొందరు రెబల్ గ్రూపుగా ఏర్పడి ఎన్నికల సమయంలో సీక్రెట్ మీటింగులు నిర్వహిస్తుండటం అయోమయానికి గురి చేస్తున్నది.

పార్టీకి పలువురి రాజీనామా

పార్టీ నుంచి పలువురు వెళ్లిపోవడం కూడా రాష్ట్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన అంబర్‌పేట నుంచి సీనియర్‌ నేత వెంకట్‌రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కిషన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఇటీవల బండి సంజయ్ సొంత నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత కటకం మృత్యుంజయ పార్టీని వీడటం గమనార్హం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అగ్ర నేతలు వరుస పర్యటనలు చేసినా చివరకు చేయి కాల్చుకోవాల్సి వచ్చింది. మరి తెలంగాణలోనూ అదే సీన్ రిపీటవుతుందా? లేక కమలనాథులు గెలిచి తమ సత్తా చాటుతారా? అనేది చూడాల్సి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed