TSPSC ప్రక్షాళన అంటే.. చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్లేగా: షర్మిల

by GSrikanth |
TSPSC ప్రక్షాళన అంటే.. చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్లేగా: షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్ని రోజులు టీఎస్ పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి, ఇప్పుడు ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని ఆమె ఫైరయ్యారు. గతంలో పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు, ఉద్యోగాలు ఇవ్వండని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పలకలేదని, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నాడని మండిపడ్డారు. బోర్డు పారదర్శకంగా పని చేస్తోందని ప్రకటించి, పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదని చెప్పి, ఇప్పుడు తప్పు జరిగిందని సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని డ్రామాలు ఓట్ల కోసమే కదా! అని షర్మిల నిలదీశారు. ఇన్ని రోజులు టీఎస్ పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం కాదా అని నిలదీశారు.

పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి, ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారని ఆమె ఫైరయ్యారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిరుద్యోగుల బలిదానాలపై అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులను నిండా ముంచిన దుర్మార్గులని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ బీఆర్ఎస్ చేసిన మోసాలు చాలని, ఈ నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని ఫైరయ్యారు. తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

Advertisement

Next Story